బకాయిల గురించి మాట్లాడి సారు గరమయ్యేలా చేస్తారేంది?

Update: 2020-06-24 05:15 GMT
అందరు ముఖ్యమంత్రులు ఒక్కలా ఉండరు. ఒక్కోక్కరిది ఒక్కో స్టైల్. దేశంలోని చాలామంది ముఖ్యమంత్రులతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు విలక్షణంగా ఉంటుందన్నది తెలిసిందే. ఏళ్లకు ఏళ్లుగా సచివాలయానికి వెళ్లకుండా.. తన అధికారిక నివాసానే సీఎంవోగా మార్చేసిన ముఖ్యమంత్రులు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇదే విషయాన్ని అడిగిన వారు ఎవరైనా సరే.. ముఖం పగిలేలా.. మాట్లాడటం కేసీఆర్ కు మాత్రమే చెల్లుతుంది. అందుకే.. ఆయన్ను ప్రశ్నించే కన్నా.. సారు చెప్పింది విని రాసుకోవటానికి మించిన మంచి పని మరొకటి ఉండదంటారు.

మహమ్మారి విరుచుకుపడుతుందన్న ఉద్దేశంతో ముందస్తుజాగ్రత్తల్లో భాగంగా లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోవటంతో.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతాలతో పాటు.. రిటైర్డు ఉద్యోగులకు ఇచ్చే పింఛన్లలో కోత పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా కేసీఆర్ పట్టించుకోలేదు. లాక్ డౌన్ ను దశల వారీగా ఎత్తేస్తున్న వేళ.. పూర్తి జీతాన్ని ఇవ్వాలంటూ కొందరు చేసిన డిమాండ్ సీఎంసారుకు చుర్రుమనేలా చేసిందని చెబుతారు.

కోత పెట్టిన శాలరీని తర్వాతి కాలం లో అడ్జెస్ట్ చేస్తానని చెబితే వినకుండా.. ఇలా నిరసన గళం వినిపించటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ కారణంతోనే మే నెల జీతాన్ని మొత్తంగా ఇవ్వాలనుకున్నా.. ఇవ్వలేదన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది. తన నిర్ణయాన్ని తప్పు పట్టినా.. వేలెత్తి చూపించినా ఊరుకోని తత్త్వం కేసీఆర్ లో కాస్త ఎక్కువే. ఈ విషయం అందరికి తెలిసినా.. అప్పుడప్పుడు కొందరు మర్చిపోతుంటారు. అందుకు తగ్గట్లే.. మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

ఈ కారణంతోనే జీతాల కోత పై మే చివర్లో మాట్లాడిన ఉద్యోగ సంఘాలు జూన్ లో మాత్రం మాట్లాడకుండా ఉండిపోయాయి. వారి మౌనంతో పాటు.. పరిస్థితుల్లో వచ్చిన మార్పును గుర్తించిన కేసీఆర్ ఈ నెల జీతాన్ని పూర్తిగా ఇవ్వాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే మరోసారి సారుకు చుర్రుమనేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఫుల్ జీతాన్ని అందుకోనున్న వేళ లో.. బకాయిల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందన్న మాట వినిపిస్తోంది.

ముందు ఫుల్ జీతం తీసుకొని.. ఒకట్రెండు నెలలు వేచి చూసి.. పరిస్థితులు చక్కబడిన తర్వాత బకాయిల గురించి అడిగితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘‘ఒకవేళ ప్రభుత్వం స్పందించలేదనుకుందాం. ప్రజల్లో కూడా ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత రావటం ఖాయం. ప్రభుత్వ ఉద్యోగుల మీద సానుభూతి పెరుగుతుంది. అందుకు భిన్నంగా ముందుగా డిమాండ్లు చేయటం తప్పు’’ అని ఉద్యోగ సంఘాలకు చెందిన ఒక నేత అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాధినేత మూడ్ కు తగ్గట్లు నడుచు కోక తప్పదని.. లేదంటే అనవసరమైన చిక్కులు వచ్చి పడతాయన్న ఆయన మాట విన్నప్పుడు.. సారు విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో ఇట్టే అర్థం కాక మానదు. కేసీఆర్ గురించి ఇన్ని తెలిసిన తర్వాత కూడా.. ఆయనకు చుర్రుమనిపించేలా మాట్లాడటంలో అర్థముందా? అన్నది ప్రశ్న.
Tags:    

Similar News