జీవోలు జ‌నాలు తెలుసుకునే హ‌క్కు లేదా కేసీఆర్‌?

Update: 2018-03-25 03:54 GMT
అంతా బాగుంద‌నుకుంటే అంతా బాగున్న‌ట్లే. కానీ.. అదెంత నిజం? అన్న ప్ర‌శ్న వేసుకున్న‌ప్పుడే అస‌లు విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. తాజాగా కేసీఆర్ స‌ర్కారుకు సంబంధించి ఫీల్ గుడ్ ఫ్యాక్ట‌ర్ ను ప‌క్క‌న పెట్టి.. పాల‌న ఎలా సాగుతోంది? క‌నీస విష‌యాల మీద స‌మాచారం ఇచ్చే జీవోల్ని ఎందుకు దాచేస్తున్నారు. వేటిని ఎందుకు అప్ లోడ్ చేయ‌టం లేదు?  పాల‌న‌కు సంబంధించి ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు ఎలా ఉన్నాయ‌ని విశ్లేష‌ణ చేసుకునే అవ‌కాశం ప్ర‌జా ప్ర‌భుత్వం ఎందుకు కల్పించ‌టం లేదు?  అన్న ప్ర‌శ్న‌లు సంధించేలా ఒక‌ప్ర‌ముఖ మీడియా సంస్థ నుంచి ఒక భారీ క‌థ‌నం ప‌బ్లిష్ అయ్యింది.

కేసీఆర్ స‌ర్కారు ఎంత ఓపెన్ గా ఉంటుంది?  త‌న పాల‌న‌కు సంబంధించి ఎన్ని విష‌యాల్ని బ‌య‌ట‌పెడుతుంద‌న్న విష‌యాన్ని గ‌ణాంకాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టి.. కేసీఆర్ స‌ర్కారు మ‌రీ ఇంత గుట్టా? అని విస్మ‌యానికి గుర‌య్యేలా చేసింది. రాజ‌రికంలో దాప‌రికం మామూలే. అందుకు భిన్నంగా ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌ల చేత‌.. ప్ర‌జ‌ల కొర‌కు.. ప్ర‌జ‌లు ఎన్నుకునే ప్ర‌భుత్వం అన్ని అంశాల్ని వారితో షేర్ చేసుకోవ‌టం క‌నీస బాధ్య‌త‌.

దాన్ని తుంగ‌లోకి తొక్కేసిన‌ట్లుగా పాల‌నాప‌రంగా తాము తీసుకుంటున్న సాధార‌ణ అంశాల్ని సైతం బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా క‌ట్ట‌డి చేస్తున్న వైనంపై ప‌లువురు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇదేమీ ఇప్ప‌టికిప్పుడు మొద‌లైంది కాదు. దాదాపు 2015 లోనే స్టార్ట్ అయ్యింది. అది ఏడాదికేడాదికి పెరిగిపోతూ.. ఈ రోజు సాదాసీదా జీవోలు సైతం బ‌య‌ట‌కు రాకుండా ఉండిపోతున్న ప‌రిస్థితి.

దీంతో.. ప్ర‌భుత్వ విధానాల్ని విశ్లేషించే అవ‌కాశం లేకుండాపోతుంది. ఇటీవ‌ల మాల్స్..మ‌ల్టీఫ్లెక్సుల్లో పార్కింగ్ రుసుముల‌కు సంబంధించి తెలంగాణ ప్ర‌భుత్వం ఒక జీవో జారీ చేసింది. కానీ.. దీనికి సంబంధించిన స‌మాచారం ప్ర‌భుత్వ అధికారిక వెబ్ సైట్ల‌లో అందుబాటులో లేదు.. కానీ.. అధికారుల ట్విట్ట‌ర్ ఖాతాలో మాత్రం క‌నిపించింది. ప్ర‌జ‌ల‌కు ఎంతో అవ‌స‌ర‌మైన ఈ జీవోను ప్ర‌భుత్వం ఎందుకు అప్ లోడ్ చేయ‌లేదు?  దీన్ని బ‌య‌ట పెట్ట‌టం ద్వారా ప్ర‌జ‌ల్లో మ‌రింత అవ‌గాహ‌న క‌లిగే వీలుంది. కానీ.. ఆ ప‌ని ప్ర‌భుత్వం ఎందుకు చేయ‌టం లేద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించ‌ని ప‌రిస్థితి. అంతేనా.. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కూ అంటే.. గ‌డిచిన రెండున్న‌ర నెల‌ల్లో అన్ని శాఖ‌ల్లో క‌లిపి 4వేల జీవోలు జారీ చేస్తే.. వెబ్ సైట్లో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్న జీవోలు కేవ‌లం 1703 మాత్ర‌మే కావ‌టం గ‌మనార్హం. అందులోనూ జీవోఆర్టీలే 1500కు పైగా ఉండ‌టం మ‌రో విశేషంగా చెప్పాలి.

పాల‌నాప‌రంగా ఎన్నో శాఖ‌లు ఉన్నా.. మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌.. విప‌త్తు నిర్వ‌హ‌ణ‌.. ఇంధ‌న‌..కార్మిక శాఖ‌లు జారీ చేసిన జీవోలు త‌ప్పించి మిగిలిన అన్నీ శాఖ‌లు ఒకటే మాట అన్న‌ట్లు జీవోల జారీ విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తూ.. ష్ గ‌ప్ చుప్ అన్న‌ట్లే వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఉమ్మ‌డి రాష్ట్రంలోని ప్ర‌భుత్వాల‌న్నీ ప్ర‌జ‌ల‌కు బ‌య‌ట‌కు తెలీకూడ‌ద‌న్న విష‌యాల‌కు సంబంధించిన జీవోల‌ను వెబ్ సైట్ లోని ర‌హ‌స్య‌మంటూ అప్ లోడ్ చేసే వారు. అయితే.. ఘ‌న‌త వ‌హించిన కేసీఆర్ స‌ర్కార్ గ‌డిచిన రెండేళ్లుగా ఆ ప‌ని చేయ‌టం లేదు. ప్ర‌తిది గుట్టుగా ఉంచేస్తుంది. అదెంత వ‌ర‌కూ వెళ్లిందంటే.. నిధులు విడుద‌ల‌కు సంబంధించిన వివ‌రాల్ని కూడా బ‌య‌ట పెట్ట‌టం లేదు.

ప్ర‌భుత్వం అంత గుట్టుగా ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తుంది? అన్న ప్ర‌శ్న వేసుకుంటే ఆస‌క్తిక‌ర స‌మాధానం వ‌స్తోంది. జీవోల ఆధారంగా కోర్టుల‌ను ఆశ్ర‌యిస్తున్నార‌ని.. అందుకే వెబ్ సైట్లోకి అప్ లోడ్ చేయ‌టం లేద‌ని చెబుతున్నారు. అయితే.. ఈ వాద‌న‌ను పాల‌నా అధికారులు మాత్రం ఖండిస్తున్నారు. ఓవైపు స‌మాచార హ‌క్కు చ‌ట్టమ‌ని తీసుకొచ్చి.. ప్రభుత్వం తీసుకునే నిర్ణ‌యాల‌న్నీ ప్ర‌జ‌ల‌కు తెలిసేలా పార‌ద‌ర్శ‌కంగా ఉండాల్సింది పోయి.. అందుకు భిన్నంగా ఇంత గుట్టుగా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిట‌న్న విస్మ‌యం ఈ మ‌ధ్య‌న పెరుగుతోంది.

కేసీఆర్ స‌ర్కారులో.. తాము జారీ చేసిన జీవోల్లో అతి త‌క్కువ‌గా అప్ లోడ్ చేసిన శాఖ విష‌యానికి వ‌స్తే.. అది ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నేతృత్వం వ‌హించే పుర‌పాల‌క శాఖ‌లో అని చెప్పాలి. జ‌న‌వ‌రి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ 150 జీవోలు జారీ చేస్తే.. ఇందులో జీవోఎంఎస్ లు 67 రాగా.. అందులో ఒక్క‌టంటే ఒక్క‌టి ఆన్ లైన్లో అందుబాటులో లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

ఈ క‌థ‌నంలో జీవోఎంఎస్.. జీవోఆర్టీ అంటూ రెండు మాట‌ల్ని ప్రస్తావించ‌టం జ‌రిగింది. ఈ రెండింటి మ‌ధ్య వ్య‌త్యాసం ఏమిట‌న్న‌ది సింఫుల్ గా చెప్పాల్సి వ‌స్తే.. జీవోఎంఎస్ అంటే కీల‌క అంశాల‌కు సంబంధించి జారీ చేసే జీవోల‌ను జీవోఎంఎస్ గా పేర్కొంటారు. అదే  స‌మ‌యంలో సాధార‌ణ అంశాల‌కు సంబంధించి అంటే.. చిన్న మొత్తాల చెల్లింపు.. ఉద్యోగుల‌కు సంబంధించి విధాన‌ప‌ర‌మైన అంశాలు కాని వాటిని  జీవోఆర్టీలుగా పేర్కొంటారు. పాల‌న మొత్తం పార‌ద‌ర్శ‌కంగా ఉంద‌ని.. క‌డుపు క‌ట్టుకొని ప‌ని చేస్తామ‌ని చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. జీవోల జారీలో అన్ని ప‌రిమితులు ఎందుకు పెట్టుకున్న‌ట్లు?  ఓపెన్ గా ఎందుకు ఉండ‌న‌ట్లు?
Tags:    

Similar News