తెలంగాణ సీఎంపై ట్వీట్ చేస్తే ఇలానే ఉంటుంది

Update: 2017-05-04 04:47 GMT
రెండు తెలుగురాష్ట్రాల్లో కొన్ని విష‌యాల్లో.. చ‌ట్టం ఎంత క‌ర‌కుగా వ్య‌వ‌హ‌రిస్తుందో కాంగ్రెస్ అధిష్ఠానానికి అత్యంత స‌న్నిహితుడైన డిగ్గీరాజా అలియాస్ దిగ్విజ‌య్ సింగ్‌ కు అర్థం కావ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న చేసిన ఒక ట్వీట్ పెను దుమారాన్ని రేప‌టం తెలిసిందే. ముస్లిం యువ‌త‌ను ఆక‌ర్షించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఐసిస్ న‌కిలీ వెబ్ సైట్ తెరిచి రెచ్చ‌గొట్టారంటూ ఆరోపించ‌ట‌మే కాదు.. దీనికి బాధ్య‌త వ‌హిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాలంటూ ఆయ‌న చేసిన డిమాండ్ క‌ల‌క‌లాన్ని రేపింది. ఈ ట్వీట్ పై రియాక్ట్ అయిన మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించ‌ట‌మే కాదు.. బాధ్య‌త క‌లిగిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత ఇంత బాధ్య‌తారాహిత్యంతో వ్య‌వ‌హ‌రిస్తారా? అంటూ ధ్వ‌జ‌మెత్తారు.

అనంత‌రం డిగ్గీ ట్వీట్ పై పోలీసు అధికారులు.. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని సైతం తీవ్రంగా రియాక్ట్ అవుతూ.. ఇలాంటి తప్పుడు ట్వీట్ల‌కు మూల్యం చెల్లిస్తార‌న్న హెచ్చ‌రిక చేశారు. త‌ప్పుడు ట్వీట్‌ కు చెంప‌లేసుకోవాల‌ని కోరారు. అయితే.. వీరి మాట‌ల్ని డిగ్గీ రాజా ప‌ట్టించుకోన‌ట్లుగా ఎలాంటి స్పంద‌న వ్య‌క్తం చేయ‌క‌పోవ‌టంతో.. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయేలా చేయాల‌న్న ఆలోచ‌న‌లో తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

దిగ్విజ‌య్ చేసిన నిరాధార ఆరోప‌ణ‌ల ట్వీట్ పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి? ఎలాంటి కేసులు న‌మోదు చేయొచ్చు? ఒక‌వేళ‌.. కేసు న‌మోదు చేస్తే న్యాయ‌ప‌రంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లేంది? లాంటి అంశాల‌పై కీల‌క స‌మావేశాన్ని నిర్వ‌హించిన‌ట్లుగా చెబుతున్నారు. స‌మావేశంలో పాల్గొన్న పోలీసు అధికారులు.. దిగ్విజ‌య్ మీద మూడు నాలుగు కేసులు నమోదు చేయొచ్చ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి.. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లకు భంగం వాటిల్లేలా కుట్ర చేసిన‌ట్లుగా ట్వీట్ ఉంద‌న్న అభిప్రాయం పోలీసు అధికారులు వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ మేర‌కు న్యాయ‌శాఖ స‌ల‌హాల్ని తీసుకొని కేసు న‌మోదు విష‌యంపై తుది నిర్ణ‌యం తీసుకోవాల‌ని బావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. డిగ్గీ చేసినట్లుగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎలాంటి న‌కిలీ ఐసిస్ వెబ్ సైట్ల‌ను ర‌న్ చేయ‌టం లేద‌న్న విష‌యాన్ని క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. మొత్తంగా డిగ్గీ ట్వీట్ ఇష్యూలో తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు సీరియ‌స్ గా ఉన్న నేప‌థ్యంలో కొత్త తిప్ప‌లు త‌ప్ప‌వ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News