నేత‌ల‌పై కాసుల వ‌ర్షం

Update: 2021-10-23 02:30 GMT
ఎన్నిక‌లు వ‌స్తే ప్ర‌జ‌ల‌కు పండ‌గే అనేలా నేటి రోజులు మారిపోయాయి. ప్ర‌జాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ఎన్నిక‌లో విజ‌య‌మే ల‌క్ష్యంగా నాయ‌కులు జ‌నాల‌కు తాయిలాలు అంద‌జేస్తున్నారు. డ‌బ్బు మ‌ద్యం లాంటి ప్ర‌లోభాల‌కు గురి చేసి జ‌నాల ఓట్లు సంపాదించుకుంటున్నారు. కానీ ఈ మ‌ధ్య ప్ర‌జ‌లు కూడా ఎంతో తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అన్ని పార్టీల ద‌గ్గరి నుంచి డ‌బ్బులు తీసుకుని త‌మ‌కు న‌చ్చిన అభ్య‌ర్తికే ఓట్లు వేస్తున్నారు. ఎన్నిక‌లు జ‌రిగే చోట ప్ర‌జ‌ల సంగ‌తి ఇలా ఉంటే.. ఇక స్థానిక నాయ‌కుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా పార్టీని న‌మ్ముకుని ఉన్న ఇలాంటి నేత‌ల‌పై ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యంలోకాసుల వ‌ర్షం కురుస్తోంది. ముఖ్యంగా రాజ‌కీయ వేడిని ర‌గిల్చిన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌.. స్థానిక నాయ‌కుల‌కు వ‌రంగా మారింద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారింది. త‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి ఇప్పుడీ ఉప ఎన్నిక‌లో బీజేపీ త‌ర‌పున పోటీకి దిగిన ఈట‌ల రాజేంద‌ర్‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ లేకుండా చూసేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అందుకే ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని ఇత‌ర పార్టీల‌కు చెందిన కీల‌క నాయ‌కుల‌ను ముందుగానే పార్టీలోకి చేర్చుకుని వాళ్ల‌కు ప‌ద‌వులు ఇస్తాన‌నే హామీనిచ్చారు. మ‌రోవైపు జ‌డ్పీటీసీ ఎంపీటీసీ స‌ర్పంచ్ వార్డు స‌భ్యులు ఇలా స్థానిక నేత‌ల‌నూ సంతృప్తి ప‌రిచే ప‌నిలో పార్టీలున్నాయి.

ఇప్ప‌టికే కులాల వారీగా సంఘాల‌తో స‌మావేశాలు విందులు గ్రామ‌స్థాయి నుంచి మండ‌ల స్థాయి వ‌ర‌కూ ప‌లుకుబ‌డి క‌లిగిన నాయ‌కుల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు పార్టీలు శాయాశ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇప్ప‌టికే ఇలాంటి స్థానిక నేత‌లు చాలా మంది ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి మారారు. ఈ నేత‌ల‌కు స్థాయిని బ‌ట్టి భారీగా డ‌బ్బులు ముట్టజెపుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. గ‌తంలో తాను ఎంపీటీసీ స‌భ్యుడిగా గెలిచేందుకు ఖ‌ర్చు చేసిన డ‌బ్బులు ఇప్పుడు ఒక్క‌సారే వ‌చ్చాయ‌ని ఓ వ్య‌క్తి చెప్ప‌డం అక్క‌డి ప‌రిస్థితికి ద‌ర్ప‌ణం ప‌డుతోంది. ఇక గ్రామాల్లోని స‌ర్పంచుల‌కు కూడా భారీ స్థాయిలోనే డ‌బ్బులు అందుతున్నాయ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇవే కాకుండా ఇంట్లో ఎక్కువ సంఖ్య‌లో ఓట్లు ఉన్న కుటుంబాల‌కు భారీగానే న‌గ‌దు అందించేందుకు పార్టీలు సిద్ధ‌మ‌య్యాయ‌నే టాక్ వినిపిస్తోంది. త‌మ గ్రామాల్లో కొంత‌మంది నాయ‌కుల‌కు డ‌బ్బులు అందాయ‌ని ఇక త‌మ వంతు ఎప్పుడు వ‌స్తుందోన‌నే మ‌రొకంత మంది నేత‌లు ఎదురు చూడ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌జ‌లు కూడా ఈ ఎన్నిక‌ల్లో చ‌ర్చ‌ల్లో భాగంగా ప్ర‌ధానంగా డ‌బ్బు గురించే మాట్లాడుకోవ‌డం క‌నిపిస్తోంది. కేసీఆర్ వ‌ర్సెస్ ఈట‌ల మ‌ధ్య పోరు.. ఇలా స్థానిక నాయ‌కుల జ‌నాల జేబులు నింపుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News