తెలంగాణ ఐఏఎస్‌ లకు చేతినిండా పని

Update: 2016-03-21 10:10 GMT
 తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్‌ ల కొరత తీవ్రంగా ఉంది.  విభజన అనంతరం రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్ ల సంఖ్య బొటాబొటిగా ఉండగా  ఉన్న ఐఏఎస్‌ లలోనూ కొందరిని  రాష్ట్ర ప్రభుత్వం పక్కకు పెట్టి వారికి ప్రాధాన్యత లేని శాఖలు అప్పగించింది.  దీంతో కొందరికి అదనపు బాధ్యతలను అప్పగించారు. వారంతా ఇప్పుడు మోయలేని పనిభారంతో సతమతమవుతున్నారు.
   
ఐఏఎస్‌ ల కొరత ఉందని, కొంత మందిని కేటాయించాలంటూ కేంద్రానికి సర్కార్ లేఖ రాసినా ఇంత వరకు ఏ ఒక్క అధికారిని కూడా నియమించలేదు. దీంతో ఉన్న అధికారులతో పాలన చక్కబెట్టే ప్రయత్నంలో కొంతమంది సీనియర్ అధికారులకు ప్రభుత్వం పలుశాఖల అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. అయితే ప్రభుత్వం ఐఏఎస్‌ లపై అధికభారాన్ని వేయడంతో వారు ఏ ఒక్క శాఖపై పూర్తిస్థాయిలో పట్టుభిగించలేకపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొంత మంది అదనపు బాధ్యతలు అప్పగించిన శాఖలపై పూర్తి స్థాయి పట్టుసాధించేందుకు యుద్ధం చేస్తూనే ఉన్నారు. పూర్తి స్థాయి అధికారి లేకపోవడంతో ఉద్యోగులు ఇదే అదునుగా చేసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న బలమైన ఆరోపణలున్నాయి.
   
మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్‌ కు పురపాలన-పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు మెప్మా మిషన్ డైరెక్టర్‌ గా కూడా కొనసాగుతున్నారు. ముఖ్యమైన పురపాలన - పట్టణాభివృద్ధికి పూర్తిస్థాయి అధికారిని నియమించకుండా అదనపు బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్రంలో పురపాలన పూర్తిగా పడకేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్‌ నగర్‌ జిల్లా జాయింట్ కలెక్టర్‌ గా నాన్ ఐఏఎస్‌ కు అదనపు బాధ్యతలు అప్పగించడంతో అక్కడ కలెక్టర్‌ కు తీవ్ర పని భారం పడింది. డీఆర్‌ డీఏ కేడర్ అధికారికి పూర్తిస్థాయి జాయింట్ కలెక్టర్ బాధ్యతలు అప్పగించిన దాఖలాలు ఇంతవరకు ఎక్కడా లేవని అధికారులే అంటున్నారు. అలాగే పంచాయితీరాజ్ - గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ గా విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఐఏఎస్ అనితారామచంద్రన్‌ కు ఏడు శాఖల బాధ్యతలను అదనంగా అప్పగించడంతో ఆమె తీవ్ర పని ఒత్తిడితో అలాగే ముందుకు సాగుతున్నారు. పంచాయతీరాజ్ తో పాటు  అదనంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) - తెలంగాణ స్కిల్ డెవలప్‌ మెంట్ మిషన్ (టీఎస్‌ డీఎం) - తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ - గ్రామీణాభివృద్ధి శాఖ శిక్షణ సంస్థ (టీఎస్ ఐపాడ్) - స్వామి రామానందతీర్థ గ్రామీణాభివృద్ధి సంస్థ - స్త్రీనిధి బ్యాంకు తదితర శాఖలను అదనంగా చూడాల్సిన బాధ్యత అప్పగించారు.  వీరితో పాటు రాష్టంలోని మరో 28మంది ఐఏఎస్‌ లు అదనపు బాధ్యతలతో సతమతమవుతున్నారు. మొత్తానికి తెలంగాణలో ఐఏఎస్ లకు పనిభారం మామూలుగా లేదు.
Tags:    

Similar News