ఇంతకీ ‘జడ్జి’లకు జరుగుతున్న అన్యాయం ఏమిటి?

Update: 2016-06-27 05:24 GMT
దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జడ్జిల సమూహం ఒకటి రోడ్డు మీదకు రావటం.. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేయటమే కాదు.. ర్యాలీగా గవర్నర్ ను కలిసే ప్రయత్నం చేయటం.. దాన్ని పోలీసులు అడ్డుకోవటం లాంటివి చాలా కొత్త పరిణామాలుగా చెప్పాలి. కోర్టులో ఇదే జడ్జిల ముందు వినయంగా వ్యవహరించే పోలీసులు.. తమకు న్యాయం కావాలంటూ రోడ్డు మీదకు వచ్చిన జడ్జిల బృందానని గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్ వైపుగా కూడా వెళ్లనివ్వకుండా అడ్డుపడటం తెలిసిందే.

ఉద్రిక్తతలకు కారణమైన ఈ వ్యవహారంపై జడ్జిలు ఆగ్రహావేశాల మధ్య కొద్దిమంది ఎంపిక చేసిన జడ్జిలను మాత్రమే గవర్నర్ వద్దకు పంపటానికి పోలీసులు అనుమతులు ఇవ్వటం గమనార్హం. ఇదిలా ఉంటే.. గవర్నర్ ను కలిసిన సందర్భంగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. నిత్యం న్యాయం చెప్పే న్యాయమూర్తులకు జరుగుతున్న అన్యాయం ఏమిటి? ఎన్నడూ లేనట్లు జడ్జిలే రోడ్ల మీదకు ఎందుకు వచ్చారు? నిజంగానే జడ్జిలకు అంత అన్యాయం జరుగుతుందా? లాంటి సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి.

తమకు జరుగుతున్న అన్యాయంపై జడ్జిల వాదన చూస్తే..

= రెండు రాష్ట్రాల మధ్య జడ్జిలను విభజించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రక్రియ షురూ కావటం సంతోషం కలిగించినా.. తాజాగా హైకోర్టు విడుదల చేసిన ప్రాథమిక కేటాయింపుల జాబితాను చూశాక మాపట్ల సవితి ప్రేమ చూపినట్లు తెలిసింది.

= అన్ని కేడర్లలో ఏపీలో ఖాళీలు ఉంచుతూ.. తెలంగాణలో మాత్రం లేకుండా చేశారు. ఏపీకి చెందిన యువ జడ్జిలను (నేరుగా నియమకాలు పొందిన వారిని) తెలంగాణకు ఉద్దేశపూర్వకంగా కేటాయించారు. దీంతో.. తెలంగాణలోని జడ్జిలకు ప్రమోషన్లకు అవకాశం లేకుండా చేశారు.

= తెలంగాణ రాష్ట్రాన్నిసాధించుకున్నప్పటికీ ఏపీ హైకోర్టు కింద పని చేస్తున్నామనిపిస్తుంది తప్ప.. ఉమ్మడి కోర్టులో పని చేస్తున్నట్లుగా అనిపించటం లేదు. మా ప్రతినిధులు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలిసి వినతిపత్రం సమర్పించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సైతం తెలంగాణ జడ్జిలకు ఈ వ్యవహారంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

= గవర్నర్ తో పాటు.. కేంద్ర హోం.. న్యాయశాఖల దృష్టికి తీసుకెళ్లాం. తెలంగాణ సీఎస్ దృష్టికి తీసుకెళ్లాం. కానీ.. మాకుజరిగిన అన్యాయంపై ఎవరూ సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలోహైకోర్టు.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయాం. ఈ నేపథ్యంలో హైకోర్టు.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయాం. దీనిపై హైకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదని గతంలో నిర్వహించిన సమావేశంలోనే నిర్ణయించాం.

= అదృష్టవశాత్తు జరిగిన అన్యాయంపై తెలంగాణ న్యాయవాదులు.. జ్యూడీషియల్ ఉద్యోగులు మూడు వారాలుగా ఉద్యమం చేస్తున్నారు. వారికి సంఘీభావం తెలుపుతున్నాం. కోడ్ ఆఫ్ కాండక్ట్..  సీసీఏ నిబంధనలకు లోబడి ఉండాలని తెలుసు. కానీ.. హైకోర్టు ఉద్దేశపూర్వకంగా.. అక్రమంగా.. అన్యాయంగా.. చట్టాలకు విరుద్ధంగా జడ్జిల కేటాయింపులు చేసింది. మూడు వారాలుగా ఆందోళన జరుగుతుంటే.. హైకోర్టు సమస్యను పరిష్కరించాల్సింది పోయి.. సంఘ నాయకులను.. ఉద్యోగులు.. న్యాయవాదులను భయపెడుతోంది.

= మా ప్రభుత్వం సైతం నోటి మాటగా.. లేఖల రూపేణా ఇబ్బంది కలిగిస్తోంది. అందుకే.. సామూహిక రాజీనామా చేయాలని నిర్ణయించారం. మా రాజీనామాలు కనువిప్పు కలిగిస్తాయని నమ్ముతున్నాం. లేదంటే.. ఆమరణ దీక్షలతో ప్రాణ త్యాగానికైనా సిద్ధం.
Tags:    

Similar News