తెలంగాణలో మాస్క్ పెట్టుకోకున్నా.. ఉమ్మి వేసినా తిప్పలే

Update: 2020-04-11 04:15 GMT
కరోనా విరుచుకుపడుతున్న వేళ.. కీలక నిర్ణయాల్ని తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రజలు వ్యక్తిగత శుభ్రతను పాటించటం.. కరోనా వ్యాప్తికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని రీతిలో వ్యవహరించేలా కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటి వరకూ బయటకు వచ్చే వారు మాస్కులు తగిలించుకోవటం తప్పనిసరేం కాదు. అందుకు భిన్నంగా శుక్రవారం నుంచి తప్పని సరిగా మాస్కులు పెట్టుకొనే బయటకు రావాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే భారీగా మూల్యం చెల్లించాల్సి రావొచ్చు.

వీధుల్లోకి వచ్చేవారు మాస్కులు ధరించకుంటే చర్యలు తీసుకుంటారు. జరిమానాలు విధించటంతో పాటు.. కేసులు సైతం నమోదు చేస్తారు. మాస్కులు ధరించే విషయంలోనే కాదు.. కరోనా వ్యాప్తికి అవకాశం ఉన్న ఉమ్మి వేయటం పైనా తెలంగాణ ప్రభుత్వం కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. బహిరంగ  ప్రదేశాల్లో ఉమ్మి వేసిన వారిపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. అంతేకాదు.. వారిని అరెస్టు కూడా చేయనున్నారు.

తాజాగా వీధుల్లో ఉమ్మి వేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన ఉదంతాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ మహానగరానికి చెందిన ఒక వ్యక్తి వీధుల్లో ఉమ్మి వేసిన ఉదంతంలో అతనిపై చర్యలు తీసుకోవటంతో పాటు.. కేసు నమోదు చేశారు. ఇక..వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన వ్యక్తిని అయితే ఇదే తప్పు చేసినందుకు కేసు నమోదు తో పాటు.. అరెస్టు చేయటం గమనార్హం. ఈ నేపథ్యంలో బయటకు వచ్చే వేళ ముఖానికి మాస్కు తప్పనిసరి అన్నది మర్చిపోకూడదు. అలవాటు లో భాగంగా వీధుల్లో ఉమ్మి వేస్తే.. అరెస్టు కావటం ఖాయం. జర.. భద్రం.
Tags:    

Similar News