అమ‌ర‌వీరుల ఫ్యామిలీల‌కు స‌న్మానం ఎత్తేశారే!

Update: 2018-06-03 04:39 GMT
బాధాక‌ర‌మైన విష‌య‌మై అయినా.. ఇప్పుడు చెప్పక త‌ప్ప‌దు. నాలుగేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిందంటే దానికి కార‌ణంగా అమ‌ర‌వీరుల ప్రాణ‌త్యాగం. ఎవ‌రెన్ని పోరాటాలు చేసినా.. ఉద్య‌మాలు చేప‌ట్టినా క‌ర‌గ‌ని కేంద్రాన్ని.. త‌మ వ‌రుస ప్రాణ‌త్యాగాల‌తోనే క‌ద‌లిక తెచ్చార‌ని చెప్పాలి.

ఎలాంటి స్వార్థం లేకుండా.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితే చాలు.. త‌మ భ‌విష్య‌త్ త‌రాలు బాగుప‌డ‌తాయ‌ని.. వారి ఆశ‌లు.. ఆకాంక్ష‌లు నిలుస్తాయ‌న్న స‌దుద్దేశంతో తెలంగాణ మీద ప్రేమ‌తో త‌మ ప్రాణాల్ని ప‌ణంగా పెట్టేందుకు వెనుకాడ‌ని ఎంతో మంది త్యాగ‌ధుల ఫ‌ల‌మే తెలంగాణ రాష్ట్రంగా చెప్పాలి.

అమాయ‌కుల ప్రాణాల‌తో కేంద్రం ఆట‌లాడుకుంటుంద‌ని.. వంద‌లాదిగా యువ‌త తెలంగాణ కోసం ప్రాణ‌త్యాగం చేస్తుందంటూ నాడు.. కేసీఆర్.. కోదండం మాష్టారి పోరాటాలు తెలంగాణ స‌మాజాన్ని ఏకం చేయ‌ట‌మే కాకుండా.. తెలంగాణ సాధించే వ‌ర‌కూ ఎలాంటి త్యాగానికైనా సిద్ధ‌మ‌న్న భావ‌న‌కు రావ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.  

త్యాగాల చెట్టుకు పూసిన పువ్వే తెలంగాణ‌. మ‌రి.. అలాంటి రాష్ట్రంలో.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం వేళ‌.. అమ‌ర వీరుల క‌టుంబాల‌ను పిలిచి వారికి స‌న్మానం చేయ‌టం ఆన‌వాయితీగా వ‌స్తోంది. గ‌డిచిన మూడేళ్లుగా ఇలాంటిదే జ‌రుగుతోంది.అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు స‌న్మానం చేసే స‌మ‌యంలో.. వాతావ‌ర‌ణం గంభీరంగా మారిపోవ‌ట‌మే కాదు.. త్యాగాల ఫ‌లాన్ని తాము క‌నులారా చూస్తున్నామ‌న్న భావోద్వేగం ఆ కార్య‌క్ర‌మంలో క‌నిపించేది. గ‌డిచిన మూడేళ్లుగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన తెలంగాణ ప్ర‌భుత్వానికి ఏమైందో ఏమో కానీ.. నిన్న జ‌రిగిన నాలుగో ఏడాది వార్షికోత్స‌వ వేడుక‌ల్లో తెలంగాణ అమ‌ర‌వీరుల కుటుంబాలు క‌నిపించ‌క‌పోవ‌టం హాట్ టాపిక్ గా మారింది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ప్ర‌తి ఏటా ఆన‌వాయితీగా ఉండే అమ‌రవీరుల కుటుంబాల స‌న్మాన కార్య‌క్ర‌మాన్ని ఈ ఏడాది నిర్వ‌హించ‌లేదు. దీనికి కార‌ణం ప్ర‌భుత్వంలోని ముఖ్యుల తీరే కార‌ణంగా చెబుతున్నారు. ప్ర‌భుత్వం నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు అధికారికంగా ఆహ్వానాలు పంప‌టం జ‌రిగేద‌ని.. ఈసారి అలాంటిదేమీ చేయ‌ని నేప‌థ్యంలో అమ‌రుల కుటుంబాలు రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వేడుకుల‌కు దూరంగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. తెలంగాణ స‌మాజాన్ని త‌మ త్యాగంతో క‌దిలించిన వారి కుటుంబాలు రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌ల్లో క‌నిపించ‌క‌పోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి.. ఇలాంటి చ‌ర్చ‌లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ దృష్టి వ‌ర‌కూ వెళుతున్నాయా?  లేదా?
Tags:    

Similar News