చంద్ర‌బాబు ఇంటికి త‌ల‌సాని..ఆంత‌ర్యం ఏమిటి?

Update: 2017-10-08 14:13 GMT
ప్ర‌స్తుతం తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా ప‌ని చేస్తోన్న‌ త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ గ‌తంలో టీడీపీలో కీల‌క‌మైన నేత‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుల‌లో ఒక‌రైన త‌ల‌సాని టీడీపీ త‌ర‌పున ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి, నాలుగు సార్లు గెలుపొందారు. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున స‌న‌త్ న‌గ‌ర్ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. గ‌తంలో టీడీపీ పోలిట్ బ్యూరో స‌భ్యుడిగా కూడా ప‌నిచేశారు. స‌మైక్యాంధ్ర ఉద్యమం ముమ్మ‌రంగా జ‌రుగుతున్న సంద‌ర్భంలో కూడా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ టీడీపీ కీల‌క నేత‌ల్లో ఒక‌రైన త‌ల‌సాని హ‌ఠాత్తుగా ప్లేటు ఫిరాయించారు. స‌మైక్యాంధ్ర వాదుల‌కు, టీడీపీ నేత‌ల‌కు షాక్ ఇస్తూ టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సంద‌ర్భంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు వార్నింగ్ కూడా ఇచ్చారు. తాను పార్టీ వీడుతున్నాన‌ని, త‌న జోలికి వ‌స్తే వ‌దిలిపెట్ట‌న‌ని, ఆయ‌న క‌థ‌ను రోజుకొక‌టి చొప్పున టీవీ సీరియ‌ల్ లా విప్పుతాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో, త‌నకు రాజ‌కీయ జీవితాన్ని ఇచ్చిన టీడీపీపై, అధినేత చంద్ర‌బాబుపై క‌నీస కృత‌జ్ఞ‌త కూడా చూప‌లేదని త‌ల‌సాని పై టీడీపీ నేత‌లు మండిప‌డ్డారు. ఇప్ప‌టికీ టీ-టీడీపీ నేత‌లు త‌ల‌సానిపై గుర్రుగానే ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాదవ్ హైద‌రాబాద్‌ లోని చంద్ర‌బాబు ఇంటి వ‌ద్ద ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అందులోనూ, త‌ల‌సాని అక్క‌డ క‌నిపించిన స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇంట్లో ఉన్నారు. తెలంగాణ టీడీపీ నేత‌ల‌తో రాజ‌కీయ అంశాల‌పై తీవ్ర‌మైన చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. త‌ల‌సానిని చూసిన విలేక‌రులు ఆయ‌న‌ కాన్వాయ్‌ని చుట్టుముట్టారు. మీడియాను చూసిన త‌ల‌సాని అక్క‌డ‌నుంచి వెళ్ల‌బోయారు. అయితే, మీడియా అప్ప‌టికే ఆయ‌న వ‌ద్ద‌కు చేరుకోవ‌డంతో చేసేది లేక వారితో మాట్లాడారు. తాను రోడ్ నెంబర్ 36కు వెళ్ళబోయి పొర‌పాటున‌ ఇటువైపు వచ్చానని, చంద్రబాబును క‌ల‌వ‌డానికి రాలేద‌ని చెప్పారు. చంద్ర‌బాబు హైద‌రాబాద్ లో  ఉన్న సంగ‌తి త‌న‌కు తెలియదన్నారు. ఈ వ్య‌వ‌హారంపై మీడియాలో ర‌క‌ర‌కాల ఊహాగానాలు వ‌స్తున్నాయి. త‌ల‌సాని  చంద్రబాబును కలవాలనే ఉద్దేశంతోనే అటు వైపు వచ్చార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. మీడియాను చూసి త‌ల‌సాని వెనుదిరిగి వెళ్లి ఉంటార‌ని, లేకుంటే పొర‌పాటున ఇటు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని అనుకుంటున్నారు. ఏది ఏమైనా లోగుట్టు పెరుమాళ్ల‌కెరుక అని చ‌ర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News