‘‘ఉద్యమ స్వామి’’ ఆత్మహత్య చేసుకోవటమేంటి?

Update: 2016-03-11 07:50 GMT
ఉద్యమకారులంతా ఆలోచించాల్సిన సమయమిది. ఇక.. ప్రతి ఒక్క తెలంగాణ గుండె ఆవేదనతో వేదన చెందాల్సిన ఉదంతమిది. కలిసి.. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాజ్యంలో ఒక తెలంగాణ యోధుడు ఆత్మహత్య చేసుకోవటం ఏమిటి? అంత దయనీయ పరిస్థితి ఎందుకు నెలకొంది? ‘మన’ పాలనలో మనలో ఒకడు సూసైడ్ చేసుకోవటం ఏమిటి? అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి సాదాసీదా వ్యక్తా? అంటే కానే కాదు. అలా అని పెద్ద పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి కాదు. అదే ఇక్కడ సమస్య.

తెలంగాణ అంటే నరనరాన ప్రేమను పుణికిపుచ్చుకొని.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతకైనా సరే అని మొండిగా ముందుకెళ్లే వ్యక్తి. బాధలు.. కష్టాలు.. లాఠీ దెబ్బల్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్లటమే అతని నైజం. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవం ఏమిటి? అది కూడా అనారోగ్యంలో ఉండి.. తనను ఎవరు పట్టించుకోవటం లేదన్న ఫస్ట్రేషన్ లో అన్న మాట మనసును కదిలించేది. ఇదంతా ఎవరి గురించో కాదు.. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. పార్టీ సీనియర్ నేతలు నాయిని.. ఈటెల.. హరీశ్ లాంటి నేతలు అతని పేరు ముందు ‘ఉద్యమం’ ఇంటిపేరుగా చేసిన ‘ఉద్యమ స్వామి’ విషాద ఉదంతమిది. ఉద్యమ స్వామిగా సుపరిచితుడైన జక్కుల స్వామి యాదవ్ సూసైడ్ చేసుకోవటం.. అతని గురించి తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు. తెలంగాణలోని ప్రతి గుండె తెలుసుకోవాల్సిన ఉద్యమస్వామి విషయంలోకి వెళితే..

నల్గొండ జిల్లా గుండాల మండలం తుర్కలషాపురానికి చెందిన స్వామి.. భువనగిరిలోని తన అన్న వద్ద ఉంటున్నాడు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి.. ఒక దశలో రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన ఇతను టీఆర్ ఎస్ అగ్రనాయకత్వానికి సుపరిచితుడు.

అయితే.. ఓయూలో జరిగిన ఒక ఆందోళనలో పాల్గొన్న స్వామి.. పోలీసుల కొట్టిన లాఠీ దెబ్బలకు నరాలు చచ్చుబడిపోయాయి. అనంతరం మిలియన్ మార్చ్ సందర్భంగా బస్సులో జనాల్ని తీసుకొస్తున్న అతడు కుప్పకూలిపోయాడు. అనంతరం ఆసుపత్రిలో చేర్పించినా అతను కోలుకోలేదు. కాలక్రమంలో అతని ఆరోగ్యం దిగజారటం.. ఆసుపత్రుల చుట్టూ తిరటం అతనికో అవసరంగా మారింది.

మొదట పట్టించుకున్న వాళ్లంతా తర్వాత పెద్దగా పట్టించుకోలేదని.. తెలంగాణ వచ్చిన తర్వాత అతనికి వైద్యం జరుగుతుందని భావిస్తే అదేమీ జరగలేదని పలువురు స్థానికులు చెబుతుంటారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అతన్ని పట్టించుకుంటారని అనుకున్నా అలాంటిదేమీ లేకపోవటంతో నిస్పృహకు గురైన స్వామి రైలు పట్టాల మీద తనువు చాలించాడని చెబుతున్నారు. మరోవైపు.. కాలకృత్యాలు తీర్చుకోవటం కోసం వెళ్లిన స్వామి.. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ప్రమాదవశాత్తు చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి సారించి.. ఉద్యమస్వామి విషయంలో ఏం జరిగిందన్న విషయంపై ఆరా తీస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ముఖ్యమంత్రి రియాక్ట్ అవుతారా?
Tags:    

Similar News