అబ్బా మ‌ళ్లీ వాయిదా: టెన్త్ విద్యార్థుల‌కు మ‌రోసారి నిరాశ‌

Update: 2020-06-06 16:30 GMT
వైర‌స్ ప్ర‌వేశించ‌డంతో ప‌దో త‌ర‌గ‌తి వార్షిక పరీక్ష‌లు అర్ధంత‌రంగా వాయిదా ప‌డ్డాయి. ఆ త‌ర్వాత లాక్‌డౌన్ రెండున్న‌ర నెల‌ల పాటు కొన‌సాగ‌గా ఇప్పుడు ప‌రిస్థితి చ‌క్క‌బ‌డుతోంది. ఈ స‌మ‌యంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వ‌గా హైకోర్టు క‌ల‌గ‌జేసుకుంది. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై హైకోర్టు విచార‌ణ జ‌రిగింది. తాజాగా శ‌నివారం జ‌రిగిన విచార‌ణ‌లో హైకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో మిన‌హా రాష్ట్రంలోని అన్ని చోట్ల వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు జాగ్రత్తలు తీసుకుంటూ ప‌క‌డ్బందీగా ప‌రీక్ష‌లు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ప‌రిశీలించిన రాష్ట్ర ప్ర‌భుత్వం అలా నిర్వ‌హించ‌డం స‌రికాద‌ని భావించి ప‌రీక్ష‌ల‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేసింది.

హైకోర్టు తీర్పును పరిశీలించిన అనంత‌రం రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ మేర‌కు శ‌నివారం సాయంత్రం నిర్ణ‌యం తీసుకుంది. ఎందుకంటే రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించి ఒక్క హైద‌రాబాద్‌లో త‌ర్వాత నిర్వ‌హించాల‌నే అంశంపై ప‌రిశీలించిన ప్ర‌భుత్వం అది సాధ్యం కాద‌ని గుర్తించింది. దీంతో ప‌రీక్ష‌లు వాయిదాకే మొగ్గుచూపింది. ఈ ప‌రీక్ష‌ల వాయిదాపై విద్యాశాఖ మంత్రి స‌బితారెడ్డి స్పందించి మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తీర్పును అనుసరించి పదో తరగతి వార్షిక పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పరీక్షల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటార‌ని తెలిపారు.

ఈ పరీక్షల నిర్వహణపై ఆదివారం ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అత్యావసర సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో వార్షిక ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండా ప్రీ ఫైనల్‌ పరీక్షల ప్రాతిపదికగా అప్‌గ్రేడ్ చేయాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. దీనిపై స‌మాలోచ‌న‌లు చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు తెలిపిన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వంగా జూన్ 8వ తేదీ సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పుడు మళ్లీ వాయిదా పడడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News