కరోనా అలర్ట్ : తెలంగాణలో నమోదైన తొలి ప్రైమరీ కాంటాక్ట్ కేసు !

Update: 2020-03-21 13:30 GMT
కరోనా వైరస్ భారత దేశంలోనూ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులు 300కు చేరాయి. తెలంగాణ లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 21కి చేరాయి. దీనితో తెలంగాణా ప్రభుత్వం కరోనా పై పూర్తిగా అప్రమత్తం అయ్యింది. అయితే విదేశాల నుంచి వచ్చినవారికి మాత్రమే ఇప్పటివరకు కరోనా సోకిందని తెలంగాణా ప్రభుత్వం , ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.

అయితే , తాజాగా తెలంగాణలో తొలి ప్రైమరీ కాంటాక్ట్ పాజటివ్ (ప్రైమరీ కాంటాక్ట్ అంటే .. ఒక రోగి నుంచి మరొకరికి సోకడం) కేసు నమోదయింది. విదేశాల నుంచి వచ్చిన కరోనా పేషెంట్ ద్వారా మరో వ్యక్తికి వైరస్ వ్యాప్తి చెందింది. కరోనా పేషేంట్ -14 తో సన్నిహితంగా ఉన్న 35 ఏళ్ల వ్యక్తి కి కరోనా వచ్చినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. కూకట్‌పల్లి లో ఈ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.

కరోనా సోకిన పేషెంట్-14 దుబాయ్‌ లో పర్యటించి మార్చి 14న హైదరాబాద్ చేరుకున్నాడు. అనంతరం అతడికి దగ్గు, జ్వరం, జలుబు రావడంతో మార్చి 17న పరీక్షలు చేయించుకున్నాడు. గాంధీ ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో.. శాంపిల్స్‌ ను పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. అతడికి కరోనా సోకినట్లు అక్కడ కూడా నిర్ధారణ అయింది. అప్పటి నుంచీ అతడిని గాంధీ ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. పేషేంట్‌ తో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి పరీక్షలు చేయగా.. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. పేషెంట్-14 నుంచి ఇతడికి కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్టు సోకినట్టు నిర్దారించారు. ఈ క్రమంలో ఇతడికి కూడా చికిత్స అందిస్తున్నారు గాంధీ ఆస్పత్రి వైద్యులు.

ఇదే తరహాలో పుణెలోనూ మరో కేసు నమోదయింది. విదేశాలకు వెళ్లని ఓ మహిళకు కూడా కరోనా వైరస్ సోకింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా విదేశాల్లో పర్యటించలేదు. కానీ ఆమెకు కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌ గా వచ్చింది. బాధితురాలు విదేశాలకు వెళ్లలేదని.. విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఆమె నివాసానికి రాలేదని అధికారులు చెప్పారు. అయితే , నవీ ముంబైలో మార్చి 3న ఓ వివాహానికి హాజరయ్యారని తెలపడం తో , ఆ పెళ్లి కి వచ్చిన వారిపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు ఎవరిని కలవకుండా ,. కొంచెం దూరంగా ఉండటం మీకు , మీ పక్కన ఉండేవారికి చాలా మంచింది.
Tags:    

Similar News