ఉగ్రవాదులు చంపుతుంటే చూస్తుండాలా అసద్‌?

Update: 2015-04-07 23:30 GMT
మనుషులు ఎవరికి ఆపద వచ్చినా గొంతెత్తటంలో అర్థం ఉంటుంది. కానీ.. మనుషుల రూపంలో ఉండే రాక్షసులు చచ్చిపోయారని బాధ పడే మనుషులు చాలా అరుదుగా ఉంటారు. అందులోకి నేతల రూపంలో అయితే మరికాస్త తక్కువ. అలాంటి అరుదైన వ్యక్తి మజ్లిస్‌ అధినేత.. ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ.

తాజాగా వరంగల్‌ జిల్లాలో జరిగిన వికారుద్దీన్‌ అండ్‌ కో ఎన్‌కౌంటర్‌పై అసద్‌ గళం విప్పాడు. వరంగల్‌ జిల్లా జనగామ దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌ మొత్తం తెలంగాణ ప్రభుత్వం చేసిన హత్యాకాండగా అభివర్ణించారు. ప్రభుత్వమే పథకం ప్రకారం వికారుద్దీన్‌ గ్యాంగ్‌ను హతమార్చిందని ఆరోపించారు. సూర్యాపేట కాల్పులకు ప్రతీకారంగా తాజా ఎన్‌కౌంటర్‌ చేశారంటూ విమర్శించారు.

ఇందులో నిజా..నిజాలెంతో ఎవరికి తెలీదు. కానీ.. అసద్‌ లాంటి ప్రజాప్రతినిధి బాధ్యతారాహిత్యంతో చేస్తున్న వ్యాఖ్యల్ని ఏమనాలి? చనిపోయిన వ్యక్తుల మతం ఆధారంగా రాజకీయం చేయటం ఎంతవరకు సబబు? తాజా ఎన్‌కౌంటర్‌లో చచ్చిపోయిన వికారుద్దీన్‌ అండ్‌ కో ఎంతటి దుర్మార్గులో.. వారి కారణంగా ఎన్ని కుటుంబాలు బలి అయ్యాయో అసద్‌కు తెలీదా?

అంతదాకా ఎందుకు? సూర్యాపేట కాల్పుల సందర్భంగా మరణించిన పోలీసులు మనుషులు కారా? వారికి మానవ హక్కులు లేవా? జీవించే అవకాశం లేదా? ఉగ్రవాదులు పిస్తోలు పెట్టి కాల్చేచి ప్రాణాలు తీస్తుంటే నోట వెంట మాటరాని అసద్‌కు.. వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌కు మాత్రం మాటలు ఎందుకు వస్తున్నాయి? అంతదాకా ఎందుకు ఉగ్రవాదుల కారణంగా.. జనగామ దగ్గర ఎన్‌కౌంటర్‌ జరిగిన ఈ రోజే కామినేని ఆసుపత్రిలో ఎస్‌ఐ సిద్ధయ్య మరణించారు. మరి.. ఆ మరణం ఏ హత్యాకాండకు సాక్ష్యం.

ఉగ్రవాదుల చేతిలో మరణించిన పోలీసుల విషయంలో అసద్‌ ఏం సమాధానం చెబుతారు? వారి కుటుంబాలను సాంత్వన పరిచే దమ్ము.. ధైర్యం అసద్‌కు ఉందా? ప్రాణం ఎవరిదైనా ఒకటేనని.. కాకుంటే సమాజానికి పట్టిన శనిలా ఉండే వారు చనిపోతే గొంతెత్తే అసద్‌.. సమాజం కోసం ప్రాణాలు విడిచిన వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? భారతదేశంలాంటి ప్రజాస్వామ్య దేశంలో.. అసద్‌ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు దేనికి నిదర్శనం..?

Tags:    

Similar News