తెలంగాణ ఆర్థిక ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉందా?

Update: 2019-05-21 06:21 GMT
మ‌న‌ది ధ‌నిక రాష్ట్రం అంటూ గొప్ప‌లు చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌లు సంద‌ర్భాల్లో చేసే వ్యాఖ్య‌లు మామూలుగా ఉండ‌వు. ఉద్యోగ‌స్తుల రిటైర్మెంట్ విష‌యం మీద మాట్లాడే క్ర‌మంలో.. ప‌ద‌వీవిర‌మ‌ణ చేసిన రోజునే ఉద్యోగికి ఇవ్వాల్సిన అన్ని ప్ర‌యోజ‌నాల్ని చేతికి ఇచ్చేసి.. కారులో ఇంటికి చేరాల‌న్న త‌న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. పోరాడి సాధించుకున్న తెలంగాణ‌లో చేసి చూపిస్తామ‌ని మాట్లాడారు.

మ‌రిప్పుడు జ‌రుగుతున్న‌దేమిటో తెలుసా?  రిటైర్ అయిన ఉద్యోగులు నెల‌ల త‌ర‌బ‌డి త‌మ బెనిఫిట్స్ కూడా తిరుగుతున్నారు. అంతేనా.. 104 స‌ర్వీసు ఉద్యోగ‌స్తుల‌కు నాలుగు నెల‌లుగా జీతాల్లేని ప‌రిస్థితి. అంతేనా.. భ‌గీర‌థ రుణాలను తిరిగి చెల్లించే ప్ర‌క్రియ ఈ ఏప్రిల్ నుంచి స్టార్ట్ కావాల్సి ఉన్నా.. అలా జ‌ర‌గ‌లేదు.. ఎందుకో తెలుసా?  తెలంగాణ భోషాణం ఖాళీ అయ్యింది. ఖ‌ర్చుల మీద ఖ‌ర్చులు చేస్తూ.. ఇష్టారాజ్యంగా వాడేసిన నిధుల కార‌ణంగా ఇప్పుడు ఖ‌జానా ఖాళీ అయ్యింది. కొత్త అప్పు తెచ్చే కానీ బండిని న‌డ‌ప‌లేని ప‌రిస్థితి తెలంగాణ‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

కుటుంబ‌మైనా.. చిన్న వ్యాపార‌స్తుడైనా.. చివ‌ర‌కు ప్ర‌భుత్వ‌మైనా.. వ‌చ్చే ఆదాయానికి.. చేసే ఖ‌ర్చుకు మధ్య లింకు త‌ప్ప‌నిస‌రి. ఇవాల్టికి ఇవాళ ఆదాయం రాకున్నా.. రేపొద్దున వ‌స్తుంద‌న్న బ‌ల‌మైన న‌మ్మ‌కం ఉన్న‌ప్పుడు ఆదాయానికి మించిన ఖ‌ర్చు అంటే అప్పు చేయ‌టం త‌ప్పు కాదు. కానీ.. అదో అల‌వాటుగా మారి.. చివ‌ర‌కు వ్య‌స‌నంగా మారితేనే తిప్ప‌ల‌న్ని. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు ప‌రిస్థితి ఇదే రీతిలో ఉంద‌ని చెబుతున్నారు.

ప్ర‌తి నెలా త‌క్కువ‌లో త‌క్కువ రూ.4వేల కోట్ల ఖ‌ర్చు త‌ప్ప‌నిస‌రి. అంటే.. ఏడాదికి రూ.48వేల కోట్లు. ఈ ఖ‌ర్చు మొత్తం ప్ర‌భుత్వ యంత్రాంగం త‌మ ప‌ని తాము చేసేందుకు అయ్యే ఖ‌ర్చు. ఇక ప్ర‌జ‌ల‌కు అందించే అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో పాటు.. ప్రాజెక్టుల నిర్మాణం.. ప‌నులు చేయ‌టంలాంటి వాటికి అద‌న‌పు ఖ‌ర్చు. మ‌రింత భారీగా ఖ‌ర్చు ఉన్న‌ప్పుడు ఆదాయం మాటేమిటి? అంటే స‌మాధానం రాని ప‌రిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు కార‌ణంగా కూడా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి మీద ప్ర‌భావం ప‌డింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆదాయం అనుకున్నంతగా పెర‌గ‌క‌పోవ‌టంతో ఈ ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింది. దీంతో చిన్న చిన్న బిల్లుల చెల్లింపున‌కు సైతం వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న ప‌రిస్థితి. దీంతో.. ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్లు ల‌బోదిబోమంటున్నారు. కొన్ని వ‌ర్గాల వారికి జీతాలు ఆపేసిన తీరుతో వారు హాహాకారాలు చేస్తున్నారు. సంప‌న్న తెలంగాణ అని చెప్పుకునే కేసీఆర్.. త‌న ఐదేళ్ల పాల‌న‌లో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి మ‌రీ ఇంతలా దిగ‌జార్చ‌టం ఏమిట‌న్న‌ది ప్ర‌శ్న‌.

తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ప్ర‌భుత్వంలోని అన్ని శాఖ‌ల్లో పెండింగ్ లో ఉన్న బిల్లుల మొత్తం రూ.22,400 కోట్ల వ‌ర‌కు ఉన్నాయ‌ని చెబుతున్నారు. వీటిల్లో సాగునీటి బిల్లులే రూ.10వేల కోట్ల వ‌ర‌కూ ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వ‌స్తున్న ఆదాయం అంతంత‌మాత్రంగా ఉండ‌టం.. ఖ‌ర్చు అంత‌కంత‌కూ పెరిగిపోతున్న వేళ‌.. రాష్ట్రం అప్పుల దిశ‌గా త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌ట‌మే కాదు.. ఇప్ప‌టికే ఆ విష‌యంలో చాలా దూరం జ‌ర్నీ చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వ‌కుంటే.. రానున్న రోజుల్లో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర్కోవ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News