ఇష్టారాజ్యంగా కోసేస్తున్నారట కేసీఆర్

Update: 2016-04-14 05:15 GMT
తమది సంపన్న రాష్ట్రమని.. తమ ప్రాంతం ఎంత గొప్పదన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినంత గొప్పగా ఎవరూ చెప్పలేరనే చెప్పాలి. తెలంగాణ ప్రాంత గొప్పతనం గురించి.. హైదరాబాద్ నగర ప్రాముఖ్యతను ఆయన గంటల కొద్దీ అలవోకగా చెప్పేస్తారు. ఆయన మాటల్ని విన్న వారు ఎవరైనా ఆయన వాదనతో ఏకీభవించటం ఖాయం.

మరి ఇన్ని ఘనతలున్న రాష్ట్రం.. కొన్ని విషయాల్లో ఎంత దారుణ పరిస్థితి ఉందన్న విషయాన్ని యునిసెఫ్ తాజాగా వెల్లడించింది.  సంపన్న రాష్ట్ర ఇమేజ్ ను డ్యామేజ్ చేసే అంశాలు కొన్ని ఉండటం ఇబ్బందికరమని చెప్పాలి. యునిసెఫ్ తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో తెలంగాణ రాష్ట్రంలో గర్భిణుల ప్రసవాలను సహజసిద్ధంగా కాకుండా సిజేరియన్లు చేయటం కనిపిస్తుంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక సిజేరియన్లు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలవటం గమనార్హం. ప్రసవాల సమయంలో నార్మల్ కాకుండా.. సిజేరియన్ల ద్వారానే ప్రసవాలు జరుగుతున్నాయని.. తెలంగాణ రాష్ట్రంలో ఈ తీరు ఆందోళనకరంగా ఉందని యునిసెఫ్ పేర్కొంది.

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 74.9 శాతం ప్రసవాలు సిజేరియన్లతో జరగటం గమనార్హం. సిజేరియన్ల ధోరణి ప్రభుత్వ.. ప్రైవేటు ఆసుపత్రులు పోటీ పడటం గమనార్హం.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్లు 40.6 శాతం ఉంటే.. ప్రైవేటు ఆసుపత్రుల్లో 18 శాతం వరకు ఉందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం తర్వాత అత్యధిక సిజేరియన్లు చేసే రాష్ట్రంగా పశ్చిమబెంగాల్ నిలిచింది. ఈ రాష్ట్రంలో 70.9 శాతం ఉండగా.. తర్వాత త్రిపుర నిలిచింది.

ఇక.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్ని చూసినప్పుడు అభివృద్ధి చెందిన అమెరికాలో 33 శాతం.. స్విట్జర్లాండ్ లో 33 శాతం.. జర్మనీలో 32 శాతం సిజేరియన్లతో ప్రసవాలు చేస్తుంటే.. అభివృద్ధి ఏ మాత్రం లేని దేశాలుగా పేర్కొనే ఉగాండాలో 5 శాతం.. దక్షిణ సూడాన్ లో ఒక శాతం కంటే తక్కువగా సిజేరియన్ ప్రసవాలు ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.
Tags:    

Similar News