ధనిక రాష్ట్రానికి డబ్బుల కటకట

Update: 2015-07-10 05:33 GMT
సినిమా కష్టాల మాదిరి ఒక్కసారి సమస్యల మీద సమస్యలు విరుచుకుపడటంతో తెలంగాణ ఆర్థిక పరిస్థితి దీనాతిదీనంగా తయారైంది. దేశంలో గుజరాత్‌ తర్వాతి ధనిక రాష్ట్రం తమదేనని గొప్పలు చెప్పుకున్న తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. రూ.కోటి నిధుల కోసం కూడా  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని.. ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి.

ఆడంబరంగా ప్రకటించిన రంజాన్‌ ఖర్చులకు.. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న పుష్కరాలకు ఖర్చు పెట్టటానికి డబ్బుల్లేని పరిస్థితి. నిధుల్లేక బక్కసం బోసి పోయిన పరిస్థితి. అవును.. మాది డబ్బులున్న రాష్ట్రం.. మేం ధనవంతులం అని గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది అని చెబుతున్నారు.

ఊహించని విధంగా ఒకదాని తర్వాత ఒకటిగా మొదలైన సినిమా కష్టాలతో ఇలాంటి దారుణ పరిస్థితి మొదలైందని చెబుతున్నారు. పుష్కలమైన నిధులతో.. మిగులు బడ్టెట్‌తో కళకళలాడిన తెలంగాణ ఖజనా ఇప్పుడు అందుకు భిన్నంగా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎందుకిలా అంటే.. తమకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు వసూలు చేసుకోవటానికి ఐటీ శాఖ.. తెలంగాణ ఖజానా నుంచి రూ.1260 కోట్లు రిజర్వ్‌బ్యాంకు తరలించి వేయటంతో మొదలైన కష్టాలు.. అదే సమయంలో రైతుల రుణమాపీ కోసం రూ.2250కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సి రావటంతో పాటు.. నెలసరి జీతాల కోసం రూ.వెయ్యికోట్లు విడుదల చేయటంతో నిధులు నిండుకున్నాయని చెబుతున్నారు.

దీంతో.. చేతిలో పైసా లేని పరిస్థితులో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కోటి రూపాయిల నిధులు విడుదల చేయాలంటే కూడా ముఖ్యమంత్రి లేదంటే ప్రధాన కార్యదర్శి అనుమతి తప్పనిసరి అని చెబుతున్నారు. చేతికి ఎముక లేనట్లుగా వరాలు ప్రకటించటం కూడా ఇలాంటి ఇబ్బందికి కారణంగా చెబుతున్నారు. మరోవైపు ఐటీశాఖ తరలించిన రూ.1260కోట్లు వెనక్కి వస్తాయని ఎంతో ఆశ పెట్టుకున్నప్పటికీ.. అలాంటిదేమీ చోటు చేసుకోకపోవటంతో బాండ్ల అమ్మకం ద్వారా రూ.1500కోట్లు రుణ సేకరణ చేపట్టాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిందని చెబుతున్నారు. ధనిక రాష్ట్రానికి డబ్బుల కొరతతో.. ఆర్థిక సమస్యలు ఎంత తీవ్రంగా ఉంటాయన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News