సీల్డ్ క‌వ‌ర్‌లోకి కాల్ డేటా చేరింది

Update: 2015-07-31 08:58 GMT
ఏపీకి చెందిన ప్ర‌ముఖ‌ల ఫోన్ల‌ను ట్యాప్ చేసిన దానికి సంబంధించిన కాలేడేటా మీద సాగుతున్న ప్ర‌క్రియ ఒక కొలిక్కి వ‌చ్చింది. గురువారం.. హైకోర్టు ఆదేశాల్ని టెలికం కంపెనీలు ఎట్ట‌కేల‌కు పాటించాయి.

త‌మ వ‌ద్ద‌నున్న కాల్ డేటాను ఇచ్చే విష‌యంలో స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు ర‌క‌ర‌కాల వాద‌న‌లు తెర‌పైకి తీసుకురావ‌టం తెలిసిందే. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేప‌థ్యంలో.. ఇంత‌కాలం త‌మ వ‌ద్ద‌నున్న కాల్‌డేటాను సీల్డ్ క‌వ‌ర్ లో పెట్టి.. హైకోర్టు సూచించిన‌ట్లుగా విజ‌య‌వాడ కోర్టుకు స‌ర్వీసు ప్రొవైడ‌ర్లు స‌మ‌ర్పించాయి.

బీఎస్ ఎన్ ఎల్‌.. రిల‌య‌న్స్‌.. ఎయిర్ టెల్‌.. యూనినార్ త‌దిత‌ర సంస్థ‌ల ప్ర‌తినిధులు కోర్టుకు హాజ‌రై.. త‌మ వ‌ద్ద‌నున్న స‌మాచారాన్ని కోర్టుకు అంద‌జేశారు. హైకోర్టు ఆదేశాల మేర‌కు విజ‌య‌వాడ కోర్టు త‌మకు అందిన స‌మాచారాన్ని య‌థాతదంగా హైకోర్టుకు ప్ర‌త్యేక మెసంజ‌ర్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

స‌ర్వీసుప్రొవైడ‌ర్లు స‌మ‌ర్పించిన సీల్డ్ క‌వ‌ర్ స‌మాచారాన్ని నెల రోజుల వ‌ర‌కు తెర‌వ‌కూడ‌ద‌ని.. హైకోర్టుకు పంపాల‌ని ఆదేశించ‌టం తెలిసిందే. తాజాగా త‌మ‌కు అందిన సీల్డ్ క‌వ‌ర్ ను రాష్ట్ర హైకోర్టుకు అందాల్సి ఉంది.
Tags:    

Similar News