న్యూయార్క్ - న్యూజెర్సీలో తెలుగు ప్రజల ఇబ్బందులు

Update: 2020-03-28 17:30 GMT
అమెరికాలో అత్యధికంగా భారతీయులు.. అందులో తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తుంటారు. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాలుస్తోంది. కొద్దిరోజుల్లో చైనాను మించిపోయే స్థితిలో ఉంది. అమెరికాలోని న్యూయార్క్ - న్యూజెర్సీలో కరోనాతో తీవ్రంగా ప్రభావితమవుతోంది. అమెరికాలోనే అత్యధిక కేసులు ఈ రెండు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న్యూజెర్సీ - న్యూయార్క్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో తెలుగువారు దినదినగండంగా జీవిస్తున్నారు. న్యూజెర్సీతోపాటు కాలిఫోర్నియాలో రికార్డు సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో భారతదేశంలో ఉన్న వారి కుటుంబసభ్యులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క న్యూయార్క్‌ లో 38,987 కేసులు నమోదు కాగా - న్యూజెర్సీలో 6,876 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కేసుల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న వాషింగ్టన్ - కాలిఫోర్నియా రాష్ట్రాలను న్యూజెర్సీ - న్యూయార్క్‌ ఇప్పుడు ఆ స్థానాలకు చేరాయి. న్యూయార్క్‌లో ఈ వైరస్‌ తో 432 మంది మృతిచెందగా - న్యూజెర్సీలో 81 మంది మరణించారు.

న్యూయార్క్ - న్యూజెర్సీ - కనెక్టికట్‌ రాష్ట్రాల్లో 7.68 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారని అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

న్యూయార్క్ - న్యూజెర్సీలో కేసులు పెరుగుతుండడంతో వాటి పక్కన ఉన్న పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. న్యూయార్క్ - న్యూజెర్సీ - కాలిఫోర్నియాలలో పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ప్రజలు గడప దాటడం లేదు. కరోనా కేసులు రోజుకు పెద్ద సంఖ్యలో నమోదవుతుండడంతో అక్కడ నివసించే తెలుగు ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News