తెలుగోళ్ల మీద క‌న్న‌డిగుల‌కు ఇంత కుళ్లా!

Update: 2017-09-10 05:15 GMT
దేశ‌మంతా ఒక్క‌టే. టాలెంట్ ఉన్నోడు ఎక్క‌డికైనా వెళ్లి బ‌తికేయొచ్చ‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కూ అనుకుంటున్న‌ది. కానీ.. తెలుగు రాష్ట్రాల‌కు పొరుగునే ఉన్న క‌న్న‌డిగుల తాజా తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. వారి మూలాల్ని వారే ముర్చిపోయేలా వ్య‌వ‌హ‌రించిన తీరు ఇప్పుడు చ‌ర్చ‌గా మార‌ట‌మే కాదు..ఇలాంటి కుళ్లుబుద్ధి నుంచి వారు ఎంత త్వ‌ర‌గా బ‌య‌ట‌కు వ‌స్తే అంత మంచిద‌న్న‌మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఉన్న‌ట్లుండి క‌న్న‌డిగుల కుళ్లు బుద్ధి గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వ‌చ్చింది?  తెలుగోళ్ల ప‌ట్ల క‌న్న‌డిగులు ఏం చేశారు?  తెలుగోళ్ల‌కు తీవ్ర ఇబ్బందికి గురి చేసేలా అస‌లేం జ‌రిగింది? అన్న విష‌యాల్లోకి వెళితే..

క‌ర్ణాట‌క రాష్ట్రంలో తాజాగా బ్యాంకు ఉద్యోగాల కోసం పోటీ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. క‌ర్ణాట‌క రాష్ట్రంలోని మూడు గ్రామీణ బ్యాంకుల్లో సుమారు 900 ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ల నియామ‌కానికి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ ప‌రీక్ష‌ల్ని నిర్వ‌హించారు. ఈ పోటీ ప‌రీక్ష‌లకు హాజ‌ర‌య్యేందుకు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు అభ్య‌ర్థులు క‌ర్ణాట‌క‌కు వెళ్లారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 10 వేల మందికి పైనే ఈ ఉద్యోగాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరంతా ప‌రీక్ష కోసం శుక్ర‌వార‌మే చేరుకున్నారు.

ముందుగా వేసుకున్న ప్లాన్ ప్ర‌కారం.. కొన్ని క‌న్న‌డ సంఘాల  వారు బ‌స్టాండ్ల‌లో.. రైల్వే స్టేష‌న్ల‌లో తెలుగు విద్యార్థుల్ని అడ్డుకోవ‌టం మొద‌లు పెట్టారు. క‌న్న‌డ సంఘాల తీరు ఎంత దారుణంగా ఉందంటే తెలుగు వారికి లాడ్జిల్లో రూములు ఇవ్వ‌కుండా అడ్డుకోవ‌టంతో పాటు.. ప‌రీక్షా కేంద్రాల ద‌గ్గ‌ర బైఠాయించి తెలుగు విద్యార్థుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేయ‌టం మొద‌లెట్టారు. అంతేనా.. కొన్నిచోట్ల మ‌రింత బ‌రితెగింపును ప్ర‌ద‌ర్శించారు. ప‌రీక్షా కేంద్రాల ద‌గ్గ‌ర తెలుగు వారి హాల్ టికెట్లు చించేయ‌టం.. ప‌రీక్ష హాల్లో కూర్చున్న వారిని బ‌య‌ట‌కు లాక్కొచ్చి మ‌రీ దౌర్జాన్యానికి దిగ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ప‌రీక్ష‌కు రెండు రోజుల ముందు నుంచి ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వ్వాల్సిన తెలుగు అభ్య‌ర్థుల‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ వ‌చ్చిన‌ట్లుగా ప‌లువురు చెప్ప‌టం క‌నిపించింది. ప‌రీక్ష‌ల‌కు రావొద్ద‌ని.. త‌మ ఉద్యోగాలు త‌మ‌కు మాత్ర‌మే చెందాల‌ని.. ఒక‌వేళ కాదంటే మాత్రం తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చిన‌ట్లుగా ప‌లువురు అభ్య‌ర్థులు చెప్పారు.

ఇలాంటి దారుణాలు మ‌రింతగా హుబ్లీ.. శివ‌మొగ్గల‌లో ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇంత జ‌రుగుతున్నా.. పోలీసులు మాత్రం ప్రేక్ష‌క పాత్ర పోషించ‌ట‌మే త‌ప్పించి దౌర్జాన్యాల్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌టం విశేషం. తెలుగు వారు పాల్గొంటున్నార‌న్న అక్క‌సుతో.. కొంద‌రు క‌న్న‌డిగులు ప‌రీక్ష‌లు రాయ‌కుండా బ‌హిష్క‌రించారు. క‌న్న‌డిగుల తీరుపై సర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దేశ వ్యాప్తంగా క‌న్న‌డిగుల ఉడిపి హోట‌ళ్లు.. అయ్యంగార్ బేక‌రీల‌కు మంచి ఆద‌ర‌ణ ఉంది. మ‌రి.. త‌మ వ్యాపారాలు ప్ర‌భావితం అవుతాయ‌ని తెలుగు రాష్ట్రాల్లోని క‌న్న‌డిగుల హోట‌ళ్లు.. బేక‌రీల‌ను అడ్డుకోవ‌టం ధ‌ర్మంగా ఉంటుందా? ఏ ప్రాంతానికి చెందిన వారికి వారి వారి ప్రాంతాల మీద‌.. త‌మ ప్రాంతీయులకు ల‌బ్థి చేకూరాల‌ని అనుకోవ‌టం త‌ప్పేం కాదు. కానీ.. హ‌ద్దులు దాటి.. తాజా ప‌రిణామాలు మాత్రం ఇబ్బందికి గురి చేయ‌ట‌మే కాదు.. మ‌న‌సుల్ని గాయ‌ప‌రిచేలా చేస్తాయ‌న‌టంలో ఎలాంటి సందేహం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఐబీపీఎస్ స్పందించింది. బ్యాంకింగ్ ప‌రీక్ష‌ల్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. మ‌ళ్లీ ప‌రీక్ష నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించింది. తెలుగు వారిపై జ‌రిగిన దాడిని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మిగిలిన ప‌రీక్ష‌లు రాసేందుకు వ‌చ్చే తెలుగు అభ్య‌ర్థుల‌కు త‌గినంత భ‌ద్ర‌త ఇవ్వాల‌ని కోరారు. ఇంత జ‌రిగిన త‌ర్వాత ఏ తెలుగోడు మాత్రం క‌ర్ణాట‌క‌కు ప‌రీక్ష‌ల‌కు వెళ్లే ధైర్యం చేస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఇక‌.. తాము ఎలా అయితే దేశ వ్యాప్తంగా త‌మ మార్క్ ప్ర‌ద‌ర్శిస్తూ.. అన్ని చోట్ల వ్యాపారాలు చేసే క‌న్న‌డిగులు.. త‌మ ద‌గ్గ‌ర ఉపాధికి వ‌చ్చే వారిని ఈ త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న ప‌లువురి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News