వరదల కవరేజ్ కు వెళ్లిన తెలుగు టీవీ చానల్ రిపోర్టర్ గల్లంతు

Update: 2022-07-13 04:58 GMT
గడిచిన నాలుగు రోజులుగా నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిచి ముద్దైన సంగతి తెలిసిందే. వరుస పెట్టి కురుస్తున్న వానలతో ప్రాజెక్టులన్నీ వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లో లేని రీతిలో మంగళవారం వర్షం భారీగా కురవటంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఇలాంటి ఉదంతమే ఒకటి జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలం బోర్నపల్లికి చెందిన తొమ్మిది మంది కూలీలు కుర్రులో పత్తి ఏరేందుకు వెళ్లి జలదిగ్భందనంలో చిక్కుకున్నారు.

దీంతో వీరిని కాపాడేందుకు జగిత్యాల జిల్లా యంత్రాంగం వారిని కాపాడేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ టీం కూలీల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక తెలుగు టీవీ చానల్ కు చెందిన రిపోర్టర్ ఒకరు..

తన మిత్రుడితో కలిసి కారులో బయలుదేరారు. అయితే.. వారు ప్రయాణిస్తున్న దారిలో రామోజీపేట - భూపాతిపూర్ గ్రామాల మధ్య ఉన్న కల్వర్టు దాటే ప్రయత్నం చేశారు.

అయితే.. కల్వర్టు కింద ఉన్న వాగులో వరద నీటి ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటం.. కల్వర్టు మీద వరద నీరు వేగంగా పారుతున్న విషయాన్ని గుర్తించటంలో జరిగిన పొరపాటుతో రిపోర్టర్ ప్రయాణిస్తున్న కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. అయితే.. కారులో రిపోర్టర్ తో ప్రయాణిస్తున్న మిత్రుడు మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

అతను రామోజ పేటకు క్షేమంగా చేరుకున్నాడు. కానీ.. కారులో ప్రయాణిస్తున్న చానల్ రిపోర్టర్ జమీర్ ఆచూకీ మాత్రం లభించలేదని చెబుతున్నారు. అతడి జాడ గుర్తించేందుకు ప్రత్యేక దళాలు రంగంలోకి దిగాయి. అతని కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అతడు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం.
Tags:    

Similar News