తెలుగు యువ‌త నిర్ 'వీర్య' మ‌వుతోంద‌ట‌!

Update: 2017-10-23 23:30 GMT
ఇంట‌ర్నెట్ యుగంలో మారుతున్న జీవ‌న శైలి.....పాశ్చాత్య పోక‌డ‌లు.... అర‌చేతిలో స్మార్ట్ ఫోన్లు....ఆర్డ‌ర్ చేస్తే అర‌గంట‌లోపు వాలిపోయే ఫాస్ట్ పుడ్‌....ఇవ‌న్నీయువ‌కుల‌కు తెలియ‌కుండానే తీవ్ర న‌ష్టాన్ని క‌లిగిస్తున్నాయి. ఆహారం ప‌ట్ల యువ‌కుల వ్య‌వ‌హార శైలి వారి దాంప‌త్య జీవితంపై పెను ప్ర‌భావం చూపుతోంది. పాష్ క‌ల్చ‌ర్ పేరుతో యువ‌త పోతున్న విప‌రీత పోక‌డ‌లు....సంతాన‌లేమికి కార‌ణ‌మ‌వుతున్నాయి.  మారుతున్న ఆహార అల‌వాట్లు - డ్రెస్సింగ్ క‌ల్చ‌ర్ - వాహనాల వినియోగం - సెల్‌ ఫోన్ - కంప్యూటర్లు త‌దిత‌ర అంశాలు.... యువకుల్లో సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆ అల‌వాట్ల వ‌ల్ల వారు సంతాన భాగ్యానికి దూర‌మ‌వుతున్నార‌ని వైద్య ఆరోగ్య శాఖ తాజా గ‌ణాంకాలలో వెల్ల‌డైంది. ఆధునిక జీవ‌న‌శైలి వ‌ల్ల వారిలోని వీర్య‌క‌ణాల సంఖ్య త‌గ్గిపోతోంద‌ని స‌ర్వేలో తేలింది. 2010లో 15శాతం మందిలో వీర్య కణాల తగ్గుదల కనిపించగా - 2014లో అది 25 శాతానికి పెరిగింది. 2017 నాటికి అది 40 శాతానికి చేరుకుంది. 2020 నాటికి 50శాతం మంది యువకుల్లో వీర్యకణాలు తగ్గే ప్రమాదం పొంచి ఉంద‌ని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చ‌రించింది. ముఖ్యంగా విశాఖ‌ప‌ట్నం - హైద‌రాబాద్‌ - వంటి న‌గ‌రాల‌లోని యువ‌కులు ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నార‌ని పేర్కొంది.

ఆహార‌ - జీవ‌న శైలిలో మార్పులు చేసుకోవ‌డం ద్వారా ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధార‌ణంగా ఆరోగ్యవంతమైన యువకుడి వీర్యంలో ప్రతి మిల్లీలీటర్‌ కీ 39 మిలియన్ల శుక్రకణాలుంటాయి. అయితే, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ సంఖ్య 15 మిలియన్ల కంటే తగ్గకూడదు. ఒక వేళ తగ్గితే ఆ వ్య‌క్తికి ‘లో స్పెర్మ్‌ కౌంట్‌’ ఉన్న‌ట్లు వైద్యులు నిర్ధారిస్తారు. ఆ యువకుడికి త్వరగా పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. సాధారణంగా మనిషి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉంటుంది. వృషణాల (బీజాలు)కు దానిక‌న్నా ఒకట్రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. ఒక‌వేళ బీజాల ద‌గ్గ‌ర‌ వేడి పెరిగితే వాటిలో ఉండే శుక్రకణాల సంఖ్య తగ్గి సంతాన లేమికి దారి తీస్తుంద‌ని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక జీవ‌న శైలి - ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా యువ‌కులు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతున్నారని తెలిపారు. ఫలితంగా సంతాన సాఫల్య కేంద్రాలు కుప్ప‌లుతెప్ప‌లుగా వెలుస్తున్నాయ‌ని చెప్పారు.

స్థూలకాయులు - పొగ తాగడంతోపాటు పొగాకు ఉత్పత్తులు తీసుకునేవారు - మ‌ద్యం సేవించేవారు - ఆవేశపూరిత ఒత్తిడి ఉన్నవారు - మందులు ఎక్కువగా తీసుకునేవారు - పిజ్జాలు - బర్గర్లు వంటి ఫాస్ట్ ఫుడ్ - జంక్‌ ఫుడ్‌ తీసుకునే వారు - హార్మోన్లలోపం - జ‌న్యుప‌ర‌మైన సమస్యలున్నవారు

ల్యాప్‌ టాప్ - కంప్యూటర్ల దగ్గర ఎక్కువ స‌మ‌యం పనిచేసే వారి బీజాలు రేడియేషన్‌ కు గురై  వీర్య కణాలను కోల్పోతున్నార‌ని నిపుణులు తెలిపారు.స్కిన్‌ టైట్‌ జీన్స్ - నైలాన్‌ అండర్‌ వేర్స్‌ వాడే యువకుల్లో గాలి చొరబడక శుక్రకణాల సంఖ్య తగ్గుతోంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. గాయాలు తగిలినప్పుడు సరైన వైద్యం అంద‌క‌ రక్తం గడ్డకట్టడం - బీజం వాపు - ఇన్ ఫెక్షన్ - బీజకోశాలు లేకపోవడం - ఉన్నా అవి కడుపులోపలికి వెళ్లిపోవడం, కొన్ని రకాల బీపీ, -యాంటీ బయాటిక్స్‌ డ్రగ్స్ - సైకియాట్రిక్‌ డ్రగ్స్‌తో పాటు - రాన్‌ టాక్ - జిన్‌ టాక్‌ వంటి మాత్రల వాడకం

బీజాల వద్ద నరాల వాపు - రైలు - బస్సు - ఇతర వాహనాల డ్రైవర్లు ఇంజిన్‌ దగ్గర కూర్చోవడం వల్ల బీజాలు వేడికి గురై వీర్య‌క‌ణాలు త‌గ్గిపోతున్నాయ‌ని తెలిపారు. ఆహార‌ - జీవ‌న శైలిలో మార్పులు - ఆల్క‌హాల్‌ - ధూమ‌పానం - ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండ‌డం ద్వారా ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Tags:    

Similar News