బాబుగారూ... మీ ఎమ్మెల్యే ఆవేద‌న విన్నారా?

Update: 2017-06-23 06:47 GMT
రోజు పొద్దున్న లేవ‌గానే... టెలీ కాన్ఫ‌రెన్స్‌... ఆ వెంట‌నే వివిధ శాఖ‌లపై స‌మీక్ష‌లే స‌మీక్ష‌లు... సాయంత్రం కాగానే వీడియో కాన్ఫ‌రెన్స్‌... ప్ర‌తి సోమ‌వారం పోల‌వ‌రంపై స‌మీక్ష‌... ఇక వివిధ శాఖ‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు రివ్యూల‌పై రివ్యూలు. వెర‌సి ప్ర‌తి శాఖ స‌మ‌ర్థంగా ప‌నిచేస్తోంద‌ని క‌ల‌ర్ ఇచ్చే య‌త్నం... వెర‌సీ ఇదీ ఏపీలోని టీడీపీ ప్ర‌భుత్వం దిన‌చ‌ర్య‌. టీడీపీ ప్ర‌భుత్వ దిన‌చ‌ర్య అనేకంటే... టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు దిన‌చ‌ర్య అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఈ స‌మీక్ష‌ల‌న్నీ కూడా నిర్వ‌హించేది ఆయ‌నే కాబ‌ట్టి. ఇక ఆయ‌న కేబినెట్‌ లోని మంత్రులు వారి వారి శాఖ‌ల‌పై నిర్వ‌హించే స‌మీక్ష‌లు వేరేగా ఉంటాయి. వెర‌సి నిత్యం స‌మీక్ష‌ల‌తోనే ప్ర‌భుత్వం బిజీబిజీగా ఉంటోంది.

అయితే ఆయా శాఖ‌ల ప‌నితీరు కూడా మెరుగై ఉండాలి క‌దా. ప్ర‌జ‌ల‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చినా చిటికెలో సెట్‌ రైట్ అయిపోయి ఉండాలి క‌దా. మ‌రి స‌మ‌స్య‌లు ఎక్క‌డిక‌క్క‌డే ఉంటూ ఉంటే... స‌మీక్ష‌లు నిర్వ‌హించి ఏం లాభం. ఇదే వాద‌న‌ను వినిపించారు ఓ ఎమ్మెల్యే. అస‌లు అధికార యంత్రాంగ‌మే ప‌నిచేయ‌డం లేద‌ని ఆ యువ ఎమ్మెల్యే అంతెత్తున ఎగిరిప‌డ‌టంతో పాటు... ప‌నులేవీ కాక‌పోవ‌డంతో త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పుకోలేక‌పోతున్నాన‌ని ఆయ‌న తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ ఎమ్మెల్యే... ఏదో విప‌క్ష పార్టీకి చెందిన వార‌నుకుంటే... మ‌నం త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే అలా తీవ్ర ఆవేద‌నాభ‌రిత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన స‌ద‌రు ఎమ్మెల్యే అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యేనే. అంతేనా నవ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని నిర్మాణంలో కీల‌క భూమిక పోషిస్తున్న‌ది కూడా ఆయ‌నే. ఆయ‌నే గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావ‌ణ్ కుమార్‌.

గుంటూరులో నిన్న ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... అధికార యంత్రాంగంపై అంతెత్తున ఎగిరిప‌డ్డారు. అస‌లు రాష్ట్రంలో అధికారులు ఉన్నారా? అంటూ ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారుల తీరుతో రాష్ట్రానికి రావాల్సిన ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ తెలంగాణ‌కే త‌రలిపోతున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఆయ‌న‌... పారిశ్రామిక ప్ర‌గ‌తి నివేదిక‌లు ఇచ్చి మూడేళ్లైనా అధికారుల్లో ఇప్ప‌టికీ చ‌ల‌నం లేద‌ని వాపోయారు. అస‌లు ప‌రిశ్ర‌మ‌ల శాఖ ఉందా? అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు... టీడీపీ స‌ర్కారు హ‌యాంలో పాల‌న ఎలా సాగుతుందో ఇట్టే అర్థం కాక‌మాన‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News