ప్రభుత్వ ఉద్యోగుల్లో టెన్షన్ తీర్చిన కేసీఆర్.. ఇక ఫుల్ జీతం?

Update: 2020-06-18 05:15 GMT
సంక్షోభ వేళ.. సంక్షేమ పథకాల అమలుకు లోటు రాని రీతిలో అమలు చేయటం కత్తి మీద సామే. అలాంటి విన్యాసాల్ని విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. పథకాల అమలుకు రాష్ట్రాల వద్ద నిధులు ఉన్నప్పుడు.. ప్రభుత్వ ఉద్యోగులకు నెలావారీగా ఇచ్చే జీతాలకు కోతలు పెట్టాల్సిన అవసరం ఏమిటి? పెన్షన్ మీదే ఆధారపడే పండుటాకుల మీద ప్రతాపం చూపించాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నల్ని సగటుజీవి మాత్రమే కాదు.. కోర్టులు సైతం ప్రశ్నిస్తున్న వైనాన్ని మర్చిపోకూడదు.

ఇలాంటివేళ.. ఆర్డినెన్స్ తీసుకురావటం ద్వారా ప్రశ్నించే వారికి.. తనకున్న అధికారంతో చెక్ చెప్పేశారు సీఎం కేసీఆర్. ఈ పరిస్థితుల్లో జూన్ జీతానికి కోత తప్పదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. ఉద్యోగులకు ఊరటనిచ్చేలా నిర్ణయాన్ని తీసుకున్నారు కేసీఆర్. ఈ నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి కోతలు లేకుండా జీతాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇందుకు అవసరమైన నిధుల వ్యవహారాన్ని చూసుకోవాలని అధికారుల్ని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

అన్ని కేటగిరి ప్రభుత్వ వేతనాల్లో యాభై శాతం.. నాలుగో తరగతి.. ఔట్ సోర్సింగ్.. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో పది శాతాన్ని కోతకు పెట్టారు. అన్ని రకాల రిటైర్డు ఉద్యోగుల పింఛన్లలో పాతికశాతం కోత పెట్టారు. నాలుగో తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో పది శాతం కోత విధించారు. ఇలా పెట్టిన కోతను తర్వాతి రోజుల్లో చెల్లిస్తామని చెప్పారు.

ఈ కోతల నుంచి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా చెప్పే వైద్య.. ఆరోగ్య.. పోలీసు శాఖలతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపులుఇచ్చారు. రిటైర్డు ఉద్యోగులకు ఇచ్చే పింఛన్ల మీద కోత విధించటాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో కేసు నడుస్తోంది. ఇప్పటికే జరిగిన వాదనల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానం తప్పు పట్టింది. ఈ క్రమంలోనే తాము విధించిన కోతలకు సంబంధించి ఒక ఆర్డినెన్సును తెర మీదకు తెచ్చిన ప్రభుత్వం.. తన చర్యను అధికారికంగా సమర్థించుకుందని చెప్పాలి.

మరికొద్ది రోజుల్లో రైతు బంధు పథకం కింద రైతులకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్న వేళ.. ఉద్యోగుల జీతాల్లో కోతను కంటిన్యూ చేస్తే మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం.. కోతలకు చెల్లుచీటి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. వాస్తవానికి మే జీతాన్ని కోతల్లేకుండా ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావించారని చెబుతారు.

ఉద్యోగ సంఘాలకు చెందిన కొందరు ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వటం.. డిమాండ్లు చేయటం లాంటి వాటితో ఆగ్రహానికి గురైన కేసీఆర్.. జీతాల కోతను కంటిన్యూ చేశారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. దీనికి తగ్గట్లే మే జీతం కోతలతో వచ్చింది. లాక్ డౌన్ దశల వారీగా తొలగించటం.. సాధారణ స్థితికి తీసుకొచ్చేలా సర్కారు చర్యలు తీసుకుంటున్న వేళ.. జీతాలు పూర్తిస్థాయిలో ఇవ్వకుంటే అనవసరమైన తిప్పలు తెచ్చుకున్నట్లు అవుతుందన్న ఉద్దేశంతోనే జూన్ జీతాల్ని ఎలాంటి కోతలు లేకుండా ఇవ్వాలన్న ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెల్లడవుతుందని చెబుతున్నారు.
Tags:    

Similar News