తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్

Update: 2021-10-01 09:30 GMT
అనంతపురం జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు రోజురోజుకు ముదురుతోంది. జిల్లా నేతలంతా ఒక వైపు జేసీ కుటుంబం ఒకవైపు అన్న తీరులో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇంతకాలం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వర్సెస్ ప్రభాకర్ చౌదరి మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లు ఆధిపత్య పోరు సాగింది. జేసీ కుటుంబం టీడీపీలో చేరడాన్ని ప్రభాకర్‌చౌదరి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు.

సమయం దొరికినప్పల్లా జేసీ ఫ్యామిలీపై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా జేసీ దివాకర్‌రెడ్డి రాష్ట్ర, జిల్లా రాజకీయాలకు దూరంగా ఉంటుంన్నారు. అయితే దివాకర్‌రెడ్డి సోదరుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి దూకుడు పెంచారు. ప్రతినిత్యం అధికార పార్టీ, సొంత పార్టీపై ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే స్వపక్షంలోనే విపక్షంలా తయారైంది.  ప్రభాకర్‌రెడ్డి, ప్రభాకర్‌చౌదరి మధ్య ఆధిపత్య పోరుకు బీజం పడుతోంది. ఇద్దరి మధ్య విబేధాలను పరిష్కరించాలని పార్టీ అధిష్టానం ఎన్ని సార్లు ప్రయత్నించినా నేతలు మళ్లీ మొదటికే వస్తున్నారు. జిల్లా పరిస్థితిని చక్కబెట్టలేక చంద్రబాబు తలపట్టుకుంటున్నారని చెబుతున్నారు.

మరోసారి తాడిపత్రిలో టెన్సన్ వాతావరణ నెలకొంది. తాడిపత్రిలో అవేసంస్థ ద్వారా  వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేయాలని  జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుకున్నారు. ఇదే రోజు ప్రభాకర్‌చౌదరి తాడిపత్రిలో కార్యకర్తలతో సమావేశం కానున్నారు. చంద్రబాబును సీఎం చేసేందుకే కార్యకర్తలో  ప్రభాకర్‌చౌదరి సమావేశం అవుతున్నానని చెబుతున్నారు. పోటా పోటీ కార్యక్రమాలతో తాడిపత్రిలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.  ప్రభాకర్‌రెడ్డికి ధీటుగా చౌదరి కార్యకర్తలతో సమావేశం కావడం జిల్లా టీడీపీలో ఆధిపత్యపోరు మరింత ఆజ్యం పోస్తుందని ఆ పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు.

ఇటీవల రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తుపై అనంతపురంలోని కమ్మ భవన్‌ ఓ సమావేశం నిర్వహించారు.  టీడీపీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, ఇద్దరు నేతల కనుసన్నల్లోనే వ్యవహారం నడుస్తోందని, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌ను ఉద్దేశించి ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రభాకర్‌రెడ్డిపై జిల్లా టీడీపీ నేతలంగా మూకుమ్మడిగా దాడి చేశారు. వీరిలో ప్రభాకర్‌చౌదరి గట్టిగానే ప్రభాకర్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో జేసీ ఫ్యామిలీ చేసిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జిల్లాలో పోరాటాలు చేశామని గుర్తుచేశారు. జేసీ కుటుంబమే టీడీపీకి సమస్యగా మారిందని ప్రభాకర్‌చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదానికి తెరపడక ముందే మరోసారి ప్రభాకర్‌రెడ్డి, ప్రభాకర్‌చౌదరి ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నారు. అధికార పార్టీపై పోరాడాల్సిన ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు ఇలా ఆధిపత్య పోరుకు తలపడడం ఆ పార్టీకి నష్టమేనని అంటున్నారు.

అధికార పార్టీ నేతలు సాగిస్తున్న దౌర్జన్యాలు, అక్రమాలు, భూకబ్జాలతోపాటు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన తరుణంలో ఆధిపత్యం కోసం పాకులాడటం కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. నేతలంతా ఒకేమాట, ఒకేతాటిపై నడిచి ఉంటే జిల్లాలో మెజార్టీ సీట్లు టీడీపీవేనని కార్యకర్తలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు.

ఆధిపత్యం కోసం నియోజకవర్గాల్లో నువ్వా.. నేనా అంటూ పోటీపడుతుండటంతో కార్యకర్తలు ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ పట్టుకోల్పోతోందన్న విమర్శలు లేకపోలేదు. గ్రామస్థాయిలోనూ కార్యకర్తల్లో అనైక్యతకు నేతల మధ్య విభేదాలే ప్రధాన కారణమన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తాడిపత్రిలోనే కాకుండా అనంతపురం పార్లమెంటు పరిధిలోని కళ్యాణదుర్గం, శింగనమల, గుంతకల్లు, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గ, ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఈ ఆధిపత్య పోరుకు అధినేత ఎప్పుడు ముగింపుపలుకుతారో.. ఎప్పుడు నేతలు కలిపిమెలసి మెదులుతారో అని తెలుగు తమ్ముళ్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Tags:    

Similar News