ఉగ్ర‌దాడి..పంజాబ్ లో 8 మంది మృతి

Update: 2015-07-27 06:10 GMT
భారత్ - పాక్ సరిహద్దు ప్రాంతమైన పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్  పోలీస్ స్టేషన్ పై ఈ ఉదయం ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. మారుతీ ఆల్టో కారులో  సైనిక దుస్తుల్లో వచ్చిన నలుగురు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మొదట ఓ బస్సుపై దాడి చేయడంతో ఓ ప్రయాణీకుడు కుప్పకూలిపోయాడు. అనంతరం పీఎస్ పై దాడికి దిగారు. ఒక్కసారిగా కాల్పులు వినిపించడంతో ప్రజలు భయకంపితులయ్యారు. ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీశారు. అప్రమత్తమైన పోలీసులు ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ముష్కరులు జరిపిన దాడుల్లో ఇద్ద‌రు పోలీసులు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం.

ఇప్పటి వరకు ఎనిమిది మంది దుర్మరణం చెందారు. వీరిలో ఆరుగురు సాధారణ పౌరులు ఉండగా ఇద్దరు పోలీసులున్నారు. మొత్తం పదిహేను మంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్ర‌ధాన‌మంత్రి కార్యాలయం ఈ ఘ‌ట‌న‌పై దృష్టి సారించింది.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని న‌రేంద్ర‌మోడీని కలిసి దాడి వివరాలను వివరించారు. కేంద్ర హోం శాఖ కార్యాలయం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఐబీ, ఇంటిలెజిన్స్, ఆర్మీ వర్గాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని దాడికి సంబంధించి దానిపై చర్చించనున్నారు. దాడికి పాల్పడింది ఉగ్రవాదులేనని కేంద్ర హోం శాఖ ధృవీకరించింది. మ‌రోవైపు కేంద్ర హోం శాఖ అదనపు బలగాలను గురుదాస్ పూర్ కు పంపింది. పోలీసుల స్వాధీనంలో ఉన్న గురుదాస్ ప్రాంతాన్ని మిలట్రీ ఆధీనంలోకి తీసుకుంది.
Tags:    

Similar News