సంచలనం: లండన్ లో ఉగ్రదాడి.. హై అలెర్ట్

Update: 2017-03-23 04:24 GMT
ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రమూక విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉందన్న వాదన వినిపిస్తున్న వేళ.. విచక్షణారహితంగా తుపాకీ తూటా పేలింది. బ్రిటన్ రాజధాని లండన్ లోని పార్లమెంటు ఎదుట ఒక గుర్తు తెలియని దుండగుడు.. విచక్షణ రహితంగా జరిపిన తుపాకీ కాల్పులు లండన్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఓపక్క పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ.. ఆ భవనానికి కూతవేటు దూరంలో చోటు చేసుకున్న ఉగ్రకలకలం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మరణించగా.. పలువురు గాయపడ్డారు. ముష్కరుడ్ని భద్రతా సిబ్బంది కాల్చి చంపాయి. తాజా పరిణామంతో లండన్ నగరంలో హైఅలెర్ట్ ప్రకటించారు.

లండన్ లోని పార్లమెంటు భవనంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధాని సైతం పార్లమెంటులోనే ఉన్నారు. ఇదే సమయంలో హ్యుందాయ్ ఐ40 కారులో ఒక ఉగ్రవాది బీభత్సం సృష్టించాడు. పేవ్ మెంట్ పై నడుస్తున్న పాదచారులపై కారును పోనిచ్చి వారిని ఢీకొట్టుకుంటూ వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్ పైన ఇద్దరు మృతికి కారణమయ్యాడు. మరో 20 మంది గాయపడేలా చేశాడు. అదే కారులో పార్లమెంటు భవనం దిశగా దూసుకెళ్లాడు. అక్కడి కారు ఇనుప రెయిలింగ్ ను ఢీ కొని ఆగిపోయాడు. తనదగ్గరకు వచ్చిన పోలీసు అధికారిని పెద్ద కత్తితో పొడిచి చంపిన ఉగ్రవాదిని సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసు అధికారులు కాల్చి చంపారు. ఈ ఘటన జరిగినప్పుడు బ్రిటన్ ప్రధాని థెరిసా మే పార్లమెంటులోనే ఉన్నారు.వెనువెంటనే ఆమెను అక్కడ నుంచి సురక్షితంగా తరలించారు. ప్రధాని కార్యాలయానికి చేరుకున్నఆమె.. పరిస్థితిని సమీక్షించారు.

ఉగ్రదాడి నేపథ్యంలో పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి.భద్రతా సిబ్బందిఘటనా స్థలానికి చేరుకొన్నారు.పార్లమెంటు ఆవరణలో అత్యవసర సేవల హెలికాఫ్టర్ దిగింది. ఎంపీలను.. పార్లమెంటు ఉద్యోగుల్ని లోపలే ఉంచేశారు. చుట్టుపక్కల ఇళ్లల్లోని వారిని బయటకు రానివ్వలేదు. ఉగ్ర ఘటన నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్నినిలిపివేశారు. లండన్ నగరాన్ని పోలీసులు తమ చేతుల్లోకి తీసుకొని.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఇదిలా ఉండగా బ్రిటన్ ప్రధానితో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడారు. అవసరమైన సహాయ సహకారాన్ని అందిస్తామన్నారు. మరోవైపు ఈ ఘటనను భారత్ తో సహా పలు దేశాలు ఖండించాయి. అమెరికా బాటలో పయనిస్తూ.. పలు ముస్లిం దేశాల నుంచి వచ్చే ప్రైవేటు ఫ్లైట్ లలో ప్రయాణికులతో పాటు ల్యాప్ టాప్ లు.. ట్యాబ్ లు తదితరఎలక్ట్రానిక్ వస్తువుల్ని అనుమతించమని బ్రిటన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాతి రోజే ఉగ్రదాడి ఉదంతం చోటు చేసుకోవట గమనార్హం. ఉగ్రదాడులకు అవకాశం ఉన్న వేళలో.. తామీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా బ్రిటన్ చెప్పిన మాట నిజమన్నది తాజా పరిణామం స్పష్టం చేస్తుందని చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News