రానున్న మూడు రోజులు తెలంగాణకు టెస్టింగ్ టైమ్

Update: 2020-05-20 10:50 GMT
ఇవాళ.. మే 20. మరో మూడు రోజులు అంటే.. మే 23. ఈ మూడు రోజులు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించనున్నాయా? అంటే అవునని చెప్పాలి. ఎందుకంటే.. దానికో కారణం ఉంది మరి. ఎంతకూ లొంగని కనిపించని శత్రువుతో పోరాడుతున్న రాష్ట్రాలు ఇప్పుడు విషమ పరీక్షను ఎదుర్కొంటున్నాయి. అన్నింటికి మించి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మరింత కఠినమైన పరీక్షకు సిద్ధమైందని చెప్పాలి.

లాక్ డౌన్ నేపథ్యంలో కఠిన ఆంక్షల్ని అమలు చేయటం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం లాక్ డౌన్ నిబంధనల్ని కాస్త సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాల్ని తెరిచారు. అప్పటివరకూ రోడ్ల మీదకు పెద్దగా రాని ప్రజలు.. మద్యం దుకాణాలు తెరిచిన నాటి నుంచి మాత్రం రావటం మెదలుపెట్టారు. అప్పటివరకూ భౌతిక దూరాన్ని పాటించిన వారు.. మద్యం దుకాణాల్లో లభించే మద్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి.
లాక్ డౌన్ షురూ అయ్యాక.. మొదటిసారి క్రమశిక్షణ కట్టుతప్పించి ఏమైనా ఉందంటే అది మద్యం షాపులు తెరిచిన తర్వాతే అన్న విమర్శ ఉంది. అయితే.. అందులో ఎంతవరకూ నిజం ఉందన్న విషయం.. రానున్న మూడు రోజుల్లో తేలిపోనుంది. మద్యం దుకాణాలు తెరిచి నేటికి రెండువారాలు పూర్తి అయ్యాయి. మాయదారి రోగ లక్షణాలు ఏమైనా ఉంటే.. రెండు వారాలకు బయట పడతాయి.

ఆ లెక్కన.. ఈ రోజు నుంచి రానున్న మూడు రోజుల్లో ఏమైనా కేసుల సంఖ్య పెరిగితే.. అందులో మద్యం కేసులు ఎన్ని అన్నది చెక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అంచనాలకు తగ్గట్లే.. మద్యం షాపుల వద్ద రోగం అంటుకుందన్న మాట. అదే జరిగితే.. ఇప్పుడు మరింతగా సడలించిన లాక్ డౌన్ నిబంధనల్ని మరోసారి పున: సమీక్షించుకోవాల్సి ఉంటుంది. లాక్ డౌన్ ను దశల వారీగా ఎత్తేయాలన్న యోచనలో ఉన్న సర్కారుకు.. రానున్న మూడు రోజుల్లో వచ్చే కేసుల ఆధారంగానే తెలంగాణ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అర్థమవుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News