ఉత్తరాంధ్ర ప్రజలు సీమ ప్రజల్ని తరిమేస్తారట

Update: 2019-12-25 06:28 GMT
పరిణితితో మాట్లాడటం మానేసి చాలాకాలమే అయ్యింది రాజకీయ నేతలు. ఎంతకూ తమకు అవసరమైన రాజకీయ ప్రయోజనం మినహా మరేమీ అక్కర్లేదన్నట్లుగా మాట్లాడటం ఈ మధ్య పెరిగిపోతోంది. ప్రజల్లో భావోద్వేగాలు తట్టి లేపేలా మాట్లాడటం.. తమ రాజకీయ పబ్బం గడుపుకోవటం మినహా.. బాధ్యతగా మాట్లాడాలన్న కనీస ఆలోచన లేకపోవటం చూస్తే ఏపీ రాజకీయాల్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారన్న ఆవేదన కలుగక మానదు.

ఇప్పటికే ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదన మీద ఎవరికి వారు కంగాళీ వ్యాఖ్యలతో ఇష్యూను అంతకంతకూ రచ్చగా మార్చేస్తున్నారు. రాజధాని అమరావతి భూముల విషయం మినహా మరింకేమీ ఇప్పుడు చర్చకు రావట్లేదు. అయితే.. రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాల్ని ఏం చేయాలనుకుంటున్నామన్న అంశం మీద ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ ప్రకటన చేయనప్పుడు.. అనవసరమైన ఆందోళనలు ఎందుకన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి.

ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేయటం ద్వారా తన ఉనికిని చాటుకునే రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ మరోసారి గళం విప్పారు. ప్రాంతాల మధ్య లేనిపోని గొడవల్ని పెంచేలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ మధ్యన ఏపీకి నాలుగు రాజధానులు ఉండొచ్చంటూ విపరీత వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా మినీ సచివాలయాల ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు.

రాజధాని వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు  అభివృద్ధి చెందుతాయన్న టీజీ.. విశాఖలో సచివాలయం పెడితే రాయలసీమ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారుతుందన్నారు. రాయలసీమ నుంచి విశాఖకువెళ్లాలంటే చాలా కష్టమన్న ఆయన.. ఉత్తరాంధ్ర ప్రజల మనసులు గాయపడేలా వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో ఏర్పాటైన రాజధానిని హైదరాబాద్ కు తరలించారని.. అక్కడి నుంచి తరిమేసినట్లే ఉత్తరాంధ్రప్రజలు కూడా సీమ ప్రజల్ని తరిమేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతి.. విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసినట్లే కర్నూలులోనూ మినీ సచివాలయాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను తెర మీదకు తెచ్చారు. అలాగే అమరావతిలోనూ మినీ సచివాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రపతి భవన్ ఢిల్లీలో.. హైదరాబాద్ లో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇదే రీతిలో మినీ సచివాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అలా చేయకుంటే ప్రాంతీయ అసమానతలు పెరిగి ఉద్యమాలకు దారి తీస్తాయన్నారు.

విశాఖలోనే సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని.. అమరావతి.. రాయలసీమలో ఉద్యమాలుప్రారంభమవుతాయన్నజోస్యం చెప్పిన ఆయన.. ఎవరూ మొండిగా వ్యవహరించకూడదన్నారు. సున్నిత అంశాల విషయంలో నోటికి వచ్చినట్లు మాట్లాడే కన్నా.. కాస్త ఆచితూచి మాట్లాడాలన్న విషయాన్ని టీజీకి ఎప్పటికి అర్థమవుతుందో?
Tags:    

Similar News