వ్యాక్సిన్ తో ఆ ఏజ్ గ్రూప్ వాళ్లకే ఎక్కువ లాభాలట

Update: 2021-07-26 02:48 GMT
కరోనా కంగారు మొదలై ఏళ్లవుతున్నా నేటికీ మహమ్మారి చింత తీరనే లేదు. శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమించి మహమ్మారికి మందు కనిపెడితే వైరస్ సింపుల్ గా బట్టలు మార్చుకున్నంత ఈజీగా తన రూపును మార్చుకుని మనల్ని మరింత ప్రమాదంలోకి నెట్టింది. వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా చాలా మందిలో ఉన్న భయాలకు తోడు ప్రపంచం మీద జరిగే సంఘటనలు మరింత భయపెడుతున్నాయి. రోజుకో కొత్త రకం వేరియంట్ వెలుగులోకి వస్తుండడంతో జనాలు భయపడుతూ జీవిస్తున్నారు. అసలు వ్యాక్సినేషన్ వల్ల మనం ఎంత భద్రంగా ఉంటామని అనుమానాలు రేకెత్తిస్తున్నారు.

డెల్టా, లామ్డా, కప్పా అని నోరు కూడా తిరగని పేర్లతో అనేక రకాల వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ రెండేళ్లలో లక్షల మందిని బలిగొన్న కరోనా ఇంకా ఎంతకాలం ఉండి ఎంత మందిని బలి తీసుకుంటుందోనని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అసలు వ్యాక్సిన్లు ఎంత వరకు సేఫ్ అని చాలా మందిలో చాలా రకాల సందేహాలు కలుగుతున్నాయి. దీనికి చాలా మంది చెప్పే సమాధానం ఒక్కటే. ఒక వేళ వ్యాక్సిన్ల వల్ల కరోనా పూర్తిగా నాశనం కాకపోయినా మన శరీరంలో యాంటీ బాడీలను ఉత్పత్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని ఇది వరకే చాలా మంది శాస్త్రవేత్తలు ప్రకటించారు.

తాజాగా అమెరికన్ మెడికల్ అసోసియేషన్ లో వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మన బాడీలో ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీల గురించి జర్నల్ ప్రచురించారు. దీని ప్రకారం యువకులలో కంటే ముసలి వారిలోనే యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. అంతే కాకుండా ఫైజర్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేయించుకున్న 50 మంది అభ్యర్థుల రక్త నమూనాలను ఒరిగన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ పరీక్షించి, వారి రక్తంలో ఏ మేరకు యాంటీ బాడీలు పుడుతున్నాయో గమనించారు. ఇలా వీళ్లు చేసిన పరిశోధనలో చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

అసలు యంగ్ ఏజ్ లో ఉన్న వారిలో కంటే వృద్ధులలోనే యాంటీబాడీలు గణనీయంగా ఉత్పత్తి అవుతున్నాయని వారు తెలిపారు. అయినప్పటికీ అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని పరిశోధన చేసిన సైంటిస్టులు సూచిస్తున్నారు. ఎలాగూ పెద్దవాళ్లకే వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుందని భావించి వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉండడం సరైంది కాదని అనేక మంది వైద్యులు తెలుపుతున్నారు. యాంటీ బాడీల ఉత్పత్తి కోసమైనా తప్పకుండా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటు వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా మహమ్మారిని దగ్గరకు రాకుండా నివారించడం సాధ్యం అవుతుందని తెలుపుతున్నారు.

ఏ మాత్రం అలసత్వంగా ఉండి నిర్లక్ష్యం చేసినా... మహమ్మారికి బలి అవుతారని పలువురు హెచ్చరిస్తున్నారు. ఎంతలా హెచ్చరిస్తున్నా కొంత మంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమతో పాటు తమ పక్కన వారి ప్రాణాలను కూడా రిస్క్ లో పెడుతున్నారు. మాస్కులు, సామాజిక దూరం తప్పక పాటించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా అని విర్రవీగకుండా జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా నుంచి పూర్తిగా బయటపడతామని సూచిస్తున్నారు.
Tags:    

Similar News