వీల్‌చైర్‌లో ఆ ఏపీ మంత్రి.. ఏమైంది!

Update: 2022-10-28 06:30 GMT
ఆంధ్రప్రదేశ్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఇందువల్లే ఆయనకు రెండో విడత జగన్‌ మంత్రివర్గ విస్తరణలోనూ మంత్రి పదవి దక్కిందని అంటారు. మొదటి విడత మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆదిమూలపు సురేష్‌ విద్యా శాఖ మంత్రిగా చాన్సు దక్కించుకున్నారు. రెండో విడతలో ఆయనకు ఉద్వాసన తప్పదని వార్తలు వచ్చినా ముఖ్యమంత్రి రెండో విడత కూడా కొనసాగించిన 11 మంది మంత్రుల్లో ఆదిమూలపు సురేష్‌ ఒకరు కావడం గమనార్హం.

కాగా తాజాగా ఆదిమూలపు సురేష్‌ వీల్‌చైర్‌లో కూర్చున్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మంత్రికి ఏమైందనే ఆదుర్దా నెలకొంది. ఆయనకు ఏం జరిగిందని అంతా ఆరా తీయడం ప్రారంభించారు. అయితే మంత్రి మోకాలికి ఆపరేషన్‌ నిర్వహించినట్టు వైద్యులు తెలపడంతో ఆయన అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు.

గత కొంతకాలంగా ఆదిమూలపు సురేష్‌ మోకాలి నొప్పితో బాధపడుతున్నట్టు సమాచారం. అందులోనూ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండటంతో టిడ్కో ఇళ్లు పరిశీలన వంటి కార్యక్రమాలతో ఆయన ఇటీవల కాలంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేకాకుండా మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నియోజకవర్గమంతా కలియదిరుగుతున్నారు. దీంతో ఆయనకు మోకాలి నొప్పి మరింత ఎక్కువైందని చెబుతున్నారు.

వైద్యులను సంప్రదించగా ఆపరేషన్‌ చేయించుకోవడమే ఉత్తమమని తేల్చినట్టు సమాచారం. దీంతో ఆదిమూలపు సురేష్‌ హైదరాబాద్‌లోని యశోధ ఆస్పత్రిలో తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు చెబుతున్నారు. ఆపరేషన్‌ విజయవంతంగా జరిగిందని వైద్యులు వెల్లడించారు.

ఈ మేరకు మంత్రి సురేష్‌ వీల్‌ ఛైర్‌లో ఉన్న ఫోటోను వైద్యులు విడుదల చేయగా సోషల్‌ మీడియాలో అది వైరల్‌గా మారింది. త్వరలోనే రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా తన యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆదిమూలపు సురేష్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. తనపై అభిమానం చూపుతున్న రాష్ట్ర ప్రజలు, తన నియోజకవర్గం యర్రగొండపాలెం ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News