అది ఖ‌చ్చితంగా బీజేపీకి గుడ్ న్యూసే..!

Update: 2021-06-28 23:30 GMT
2019 ఎన్నిక‌ల్లో అఖండ మెజారిటీతో విజ‌యం సాధించింది బీజేపీ. దేశ‌వ్యాప్తంగా విస్త‌రించిన కాషాయ ప‌వ‌నాల‌ను చూసి ఆ పార్టీ.. ఎక్క‌డ లేని ఆనందంలో మునిగిపోయింది. కానీ.. కేవ‌లం రెండేళ్లలో ప‌రిస్థితి మొత్తం త‌ల‌కిందులైపోయింది. నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాలు తీసుకురావ‌డంతో.. రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వ‌మ‌ని దేశ‌వ్యాప్తంగా విప‌క్షాలు ప్ర‌చారం చేసుకున్నాయి. దీని కార‌ణంగా.. మిత్ర‌ప‌క్షాలు కూడా దూర‌మైన ప‌రిస్థితి. ప్ర‌జ‌ల్లోనూ ఒక‌విధ‌మైన వ్య‌తిరేక భావం రిజిస్ట‌ర్ అయ్యింది.

ఆ త‌ర్వాత క‌రోనా మ‌రింత తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త‌ను పెంచింది. సెకండ్ వేవ్ విజృంభిస్తుంటే.. కేంద్ర మంత్రివ‌ర్గం మొత్తం బెంగాల్లో కూర్చుంద‌ని, క‌నీసంగా కూడా కొవిడ్ గురించి ప‌ట్టించుకోక‌పోవ‌డంతోనే ఈ స్థాయిలో విజృంభించింద‌నే విమ‌ర్శ‌లు తలెత్తాయి. ఏకంగా.. అంత‌ర్జాతీయ మీడియా సైతం దుమ్మెత్తిపోసింది. మొత్తంగా క‌రోనా నియంత్ర‌ణ‌లో వైఫ‌ల్యం కావ‌డం బీజేపీని బాగా ఇరుకున పెట్టేసింది.

ఈ ప‌రిస్థితి ఇలా ఉండ‌గా.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్ర‌మైన యూపీలో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల జ‌ర‌గ‌బోతున్నాయి. దీనిక‌న్నా ముందుగా ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. రామ మందిరం నిర్మిస్తున్న అయోధ్య‌లోనూ, ప్ర‌ధాని ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వార‌ణాసిలోనూ ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది. మొత్తంగా విప‌క్షాలే విజ‌య‌ఢంకా మోగించాయి. దీంతో.. క‌మ‌లం పెద్ద‌ల‌కు భ‌యం ప‌ట్టుకుంది. ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో.. ఇలాంటి ఫ‌లితాలు రావ‌డం క‌ల‌వ‌ర‌పెట్టింది.

ఈ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు సంఘ్ పెద్ద‌లు సైతం రంగంలోకి దిగారు. అయితే.. వీరికి ఊర‌ట‌నిచ్చే ప‌రిస్థితులు యూపీలో చోటు చేసుకుంటున్నాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అక్క‌డ ప్ర‌ధాన పార్టీలుగా ఉన్న ఎస్సీ, బీఎస్సీ, కాంగ్రెస్ వంటి పార్టీల‌న్నీ ఒంట‌రిగానే ఎన్నిక‌ల బ‌రిలోకి దిగబోతున్నాయ‌నే ప్ర‌చారం సాగుతోంది. నాలుగు వంద‌ల పైచిలుకు స్థానాలున్న యూపీలో.. ఈ పార్టీలు ఒంట‌రిగా చూపే ప్ర‌భావం త‌క్కువేన‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దీనివ‌ల్ల బీజేపీ వ్య‌తిరేక ఓటు త‌లా కొంత వెళ్లిపోతే.. అంతిమంగా త‌మ‌కు లాభిస్తుంద‌ని ఆశ‌లు పెట్టుకుంటోంది బీజేపీ.

మ‌రి, ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితులు ఎలా ఉంటాయి? అన్న‌ది చూడాలి. అయితే.. ఈ పార్టీలు క‌లిసి పోటీచేస్తే ఖ‌చ్చితంగా బీజేపీకి ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మే అన్న‌ది మెజారిటీ అభిప్రాయం. కానీ.. విడి విడిగా బ‌రిలోకి దిగితే మాత్రం.. బీజేపీకి మేలు జ‌రిగే అవ‌కాశం కూడా ఉండొచ్చ‌ని అంటున్నారు. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్నది చూడాలి.
Tags:    

Similar News