కర్ణాటక ఎన్నికలను శాసిస్తున్న ఆ 'ఒక్క' కులం !

Update: 2023-04-11 12:53 GMT
కర్నాటక ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న కొద్దీ పార్టీలన్నీ సామాజికవర్గాల  చుట్టే ప్రదక్షిణాలు చేస్తున్నాయి. ఈ సామాజిక వర్గాల్లో కూడా ఒక్కలిగల ప్రాబల్యం బాగా ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ వీళ్ళని ప్రసన్నం చేసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నాయి. కర్నాటకలో రెండు కులాలు మొదటినుండి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాయి. మొదటిదేమో లింగాయతులు. రెండో సామాజికవర్గం ఒక్కలిగలు. ఒక అంచనా ప్రకారం 15 శాతం ఉన్న ఒక్కలిగలు దాదాపు 100 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలరు.

పాత మైసూరు ప్రాంతంలో బాగా ప్రాబల్యం కలిగున్నారు. రామనగర, మాంఢ్య, మైసూరు, చామరాజనగర, కొడగు, కోలార్, తుముకూరు, హసన్ జిల్లాల పరిధిలోని సుమారు 60 నియోజకవర్గాల్లో ఒక్కలిగల జనాభానే ఎక్కువ. ఇపుడు జేడీఎస్ కు 24, కాంగ్రెస్ 18, బీజేపీకి 15 సీట్లున్నాయి. పై ప్రాంతాలతో పాటు బెంగుళూరు అర్బన్ జిల్లాలో 28 నియోజకవర్గాలు, రూరల్ జిల్లాలో 4 నియోజకవర్గాలు, చిక్ బళాపూర్లో 8 నియోజకవర్గాల్లో వీళ్ళు బలంగా ఉన్నారు.

ఇంతటి కీలకమైన కమ్యూనిటీని తన వైపు తిప్పుకునేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. 4 శాతం రిజర్వేషన్ను 6కి పెంచింది. అలాగే ఒక్కలిగ సామాజికవర్గానికి చెందిన స్వామీజీలతో కూడా తనకు మద్దతుగా బీజేపీ మాట్లాడిస్తోంది. కర్నాటక ఎన్నికల్లో మఠాలు, పీఠాల ప్రభావం కూడా ఉంటుంది. అందుకనే ఇక్కడ స్వామీజాలకు బాగా డిమాండ్. ప్రధానమంత్రిగా చేసిన దేవేగౌడ, ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామి ఒక్కలిగలే. వీళ్ళు కాకుండా మరికొందరు కేంద్రంలో మంత్రులుగా కూడా పనిచేశారు.

బీజేపీ పద్దతిలోనే దేవేగౌడ, కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఒక్కలిగలను ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. ముందు వీళ్ళని ప్రసన్నంచేసుకుంటే తర్వాత లింగాయతుల దగ్గరకు వెళ్ళచ్చని పార్టీలు అనుకుంటున్నాయి.

సామాజికవర్గం మద్దతుకోసం ఈమధ్యనే బీజేపీ ప్రభుత్వం కెంపేగౌడ 108 అడుగుల విగ్రహాన్ని బెంగుళూరు విమానాశ్రయం దగ్గర ఏర్పాటుచేసింది. మరి సామాజికవర్గాలు ఏ పార్టీని ఆదరిస్తాయో ఎవరికీ అర్ధంకాకుండా ఉంది. కొన్ని సర్వేలేమో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలను ప్రకటించాయి. చివరకు ఏమవుతుందో ఏమో చూడాల్సిందే.

Similar News