బీజేపీ లో చిన్నమ్మగానే... అందుకే టీడీపీ టచ్ లోకి...?

Update: 2022-09-10 06:02 GMT
ఆమె మేరు నగధీరుడు ఎన్టీయార్ కుమార్తె. తండ్రి తరఫున రాజకీయ వారసత్వం పూర్తిగా ఎవరికైనా వచ్చిందా అంటే అది ఆమెకే అనుకోవాలి. ఇంట్లో వారంతా చిన్నమ్మ అని ముద్దుగా పిలుస్తారు. ఆమె దగ్గువారి ఇంటి కోడలు. కాంగ్రెస్ లో చేరి రెండు సార్లు ఎంపీగా ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేసిన పురందేశ్వరి విభజన తరువాత క్షణం కూడా ఆలస్యం చేయకుండా బీజేపీలో చేరారు. ఇప్పటికి ఎనిమిదేళ్ళుగా ఆ పార్టీలో ఉన్నారు.

రెండు సార్లు ఆమె ఎంపీగా బీజేపీ టికెట్ మీద పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఇక 2019లో విశాఖ నుంచి పోటీ చేస్తే ఏకంగా డిపాజిట్లే గల్లంతయ్యాయి. ఒక విధంగా ఎన్టీయార్ తనయకు ఇది దారుణమైన ఓటమి కిందనే లెక్క కట్టాలి. ఇక ఆమె బీజేపీలో చేరినా కోరుకున్నా రాజ్యసభ సీటు దక్కలేదు. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఇస్తారని ఆశించినా అది కూడా ఎందుకో జరగడంలేదు.

పార్టీ పదవుల్లో ప్రాధాన్యత లేదు. నిన్న ఒడిషా ఇంచార్జి పదవి నుంచి తప్పిస్తే నేడు చత్తీస్ ఘడ్ ఇంచార్జి బాధ్యతల నుంచి పురందేశ్వరిని తప్పించారు. . దీన్ని బట్టి చూస్తే చిన్నమ్మకు బీజేపీలో చిన్నబోయేలా పరిణామాలు జరుగుతున్నాయని అంటున్నారు. దాంతో ఆమె అసంతృప్తిగా ఉన్నారు అన్న చర్చ కూడా సాగుతోంది.

మరో వైపు చూస్తే బీజేపీ అధినాయకత్వం కూడా ఎన్టీయార్ కుమార్తె అన్న భారీ ట్యాగ్ ని చూసే పార్టీలో చేర్చుకుంది అని అంటున్నారు. పైగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. పొలిటికల్ గా చూస్తే ఏపీలో బలమైన సామాజిక నేపధ్యం ఉంది. దాంతో ఆమె ఏపీ రాజకీయాల్లో బిగ్ ఫిగర్ అవుతారని, బీజేపీని పటిష్టం చేస్తారని గంపెడాశలు పెట్టుకున్నారని అంటున్నారు. అందువల్లనే ఆమెను ఏపీ బీజేపీ వలసల కమిటీ చైర్మన్ గా కూడా చేశారని అంటున్నారు.

కానీ ఆమె అధ్యక్షతన ఒక్క సమావేశం కూడా ఆ కమిటీ కాలేదని చెబుతున్నారు. మరో వైపు చూస్తే ఆమె తండ్రి స్థాపించిన టీడీపీ నుంచి ఒక్క నాయకుడిని కూడా బీజేపీ వైపుగా తేలేకపోయారు అన్న బాధ హై కమాండ్ లో ఉందిట. అదే విధంగా చూస్తే  తెలంగాణాలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటే ఏపీలో కనీసంగా కూడా లేవని, బాధ్యతలు అప్పగిస్తే చిన్నమ్మ పట్టనట్లుగా ఉంటున్నారు అన్న ఆగ్రహం కూడా బీజేపీ పెద్దలకు ఉంది అంటున్నారు.

ఆమెను పార్టీలో ఎంత పెద్దగా చూపించినా ఆమె తన ప్రభావం అయితే చూపించలేకపోతున్నారు అన్న లెక్కకు బీజేపీ హై కమాండ్ వచ్చిందని చెబుతున్నారు. ఇక ఆమె టీడీపీతో టచ్ లోకి వెళ్తున్నారు అన్న అనుమానాలు కూడా పార్టీ పెద్దలలో ఉన్నాయట. ఆమె కుమారుడు కూడా రేపటి రోజున టీడీపీ నుంచే పోటీ చేస్తారు అన్న వార్తలు ప్రచారం కావడం పట్ల కూడా బీజేపీ హై కమాండ్ ఆలోచిస్తోంది అంటున్నారు.

అందుకే ఆమెకు మెల్లగా ప్రాధాన్యతలు తగ్గించారు అని అంటున్నారు. ఆమె బీజేపీలో ఉంటూ టీడీపీకి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారు అన్న అనుమానాలు కూడా రావడంతోనే ఆమెని కాస్తా పక్కన పెడుతున్నారు అని అంటున్నారు.  అయితే పురందేశ్వరి వైపు చూస్తే ఆమె కుటుంబ పరంగా తామంతా ఒకటిగా ఉన్నా రాజకీయం రాజకీయమే అని అంటున్నారుట. తాను బీజేపీకే కట్టుబడి ఉన్నట్లుగా కూడా చెబుతున్నారుట.

అయితే కేంద్ర మంత్రిగా పనిచేసి సమర్ధ నాయకురాలిగా రుజువు చేసుకున్న పురందేశ్వరికి తగిన ప్రాధాన్యత బీజేపీలో లేదు అన్నదే ఆమెతో పాటు అనుచరుల బాధ అని అంటున్నారు. ఏపీ నుంచి రాజ్యసభ సీటు కూడా ఆమెకు ఇవ్వలేదని కూడా వారు అంటున్నారుట. మొత్తానికి చూస్తే అటూ ఇటూ అనుమానాలు గ్యాప్ పెరిగిపోతున్న నేపధ్యంలో పురందేశ్వరి భవిష్యత్తు రాజకీయం మీద కూడా చర్చ మొదలైంది అంటున్నారు.

ఆమె కానీ ఆమె భర్త  మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ ఇక రాజకీయాలు చాలు అనుకునే స్థితిలో ఉన్నారని టాక్. వారికి తమ ఏకైక కుమారుడు చెంచురాం హితైష్ రాజకీయమే ముఖ్యమని కూడా తెలుస్తోంది. హితైష్ ని వైసీపీ ద్వారా 2019 ఎన్నికల్లో పోటీ చేయిద్దామనుకున్నా కుదరలేదు. దాంతో వెంకటేశ్వరరావు పోటీ చేసి పరుచూరు నుంచి ఓటమిని చవి చూశారు. ఇక ఆ తరువాత వైసీపీని ఆయన వదిలేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి హితైష్ పోటీ చేస్తారు అని చెబుతున్నారు. మరి ఈ విషయంలో చిన్నమ్మ కూడా చేసేది ఏమీ లేదు అంటున్నారు.

ఏపీలో బీజేపీ పరిస్థితి బాగులేదు. కాబట్టి ఆమె కుమారుడు టీడీపీ నుంచే పోటీ చేసేందుకు ఆస్కారం ఉంది. అలాగని తల్లిగా ఆమె బీజేపీలో ఉంటే తప్పుపట్టినా లేక ఆమె టీడీపీ కోవర్ట్ అని భావించినా కూడా చేసేది ఏమీ లేదు అనే అంటున్నారు. మొత్తానికి ఈ రోజు కాకపోయినా మరో రోజు అయినా కుమారుడి కోసం పురందేశ్వరి ఎలాంటి కీలకమైన  నిర్ణయం అయినా తీసుకుంటారు అని అంటున్నారు. సో బీజేపీకి ఆమె ఝలక్ ఇస్తారా. బీజేపీ ఆమెను పక్కన పెడుతుందా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News