తెలంగాణలో తనిఖీల రచ్చ.. ఏపీలో మాత్రం అంతా ప్రశాంతమా?

Update: 2022-11-18 07:00 GMT
ఐటీ.. ఈడీ.. సీబీఐ.. ఇలా ఒకటి తర్వాత ఒకటి చొప్పున విచారణ సంస్థలు గురి పెట్టి వదిలిన బాణాల మాదిరి తెలంగాణలోని టార్గెట్లను రోజువారీగా దూసుకొస్తున్నాయి. డైలీ బేసిస్ గా మారిన తనిఖీల పరంపర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుందంటున్నారు. అధికార పార్టీ నేతల్లో కొందరిపైన టార్గెట్ చేసినట్లుగా జరుగుతున్న ఈ తనిఖీలు లెక్కలు ఎక్కడి వరకు వెళ్లనున్నాయి? ఏ రోజు ఏం జరుగుతుందన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పేరుకు రెండు తెలుగు రాష్ట్రాలుగా ఉన్నప్పటికీ చాలా విషయాల్లో మాత్రం రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉమ్మడిగా చేస్తున్న ఘన కార్యాలుగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న తనిఖీలకు చెందిన వారిలో పలువురికి ఏపీలోనూ మూలాలు ఉన్నాయి. అయితే.. తెలంగాణలో సాగుతున్నంతగా తనిఖీల జోరు ఏపీలో మాత్రం లేదన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది.

తెలంగాణలో గడిచిన కొద్ది వారాలుగా సాగుతున్న తనిఖీల పరంపరకు ఎప్పటికి తెర పడుతుందన్నది ఒక పట్టాన అర్థం కావట్లేదంటున్నారు. మొన్నటివరకు మద్యం స్కాం.. అంతలోనే ఎమ్మెల్యేల ఎర.. అంతలోనే మళ్లీ మద్యం స్కాం.. ఇప్పుడు సినిమాలకు పెట్టిన పెట్టుబడుల లెక్కల్ని తేల్చటమే పని మొదలైందన్న విషయం తాజా పరిణామాల్ని చూస్తే అర్థమవుతుంది. ఇన్ని జరుగుతున్నా.. తెలంగాణలో కనిపిస్తున్న సోదాల హడావుడి ఏపీలో మాత్రం అంతగా లేకపోవటం ఆసక్తికర అంశంగా చెబుతున్నారు.

ఏమైనా.. మిత్రధర్మాన్నిపాటించే విషయంలో మోడీ అండ్ కోకు మించిన వారు లేదంటారు. దీనికి ఒక ఉదాహరణను ప్రస్తావిస్తారు. ఇప్పుడంటే చెడింది కానీ.. గతంలో మోడీషాలతో కేసీఆరర్ దోస్తానా ఎంత జాన్ జిగిరీగా ఉందో తెలిసిందే. వీరి జిగిరీ స్నేహాన్నిఅంచనా కట్టటంలో పొరపాటు పడిన గులాబీ ముఖ్యనేతల్లో ఒకరు కమలం పార్టీలో చేరేందుకు.. తద్వారా ప్రభుత్వం తన చేతుల్లో ఉండేందుకు వీలుగా చక్రం తిప్పినట్లుగా చెబుతారు.

ఆ సమయంలో కేసీఆర్ మీద కానీ.. ఆయన పార్టీ మీద కానీ శత్రుత్వం లేని కమలనాథులు.. గులాబీ పార్టీలో జరుగుతున్న గూఢపుఠాణిని ఆధారాలతో సహా గులాబీ బాస్ కు అప్పజెప్పారని చెబుతారు. లెక్కలన్నీ బాగున్న వేళలో స్నేహానికి.. మిత్ర ధర్మానికి ఎంతటి పెద్దపీట వేస్తారన్న దానికి నిదర్శనంగా ఈ ఎపిసోడ్ ను ప్రస్తావిస్తారు.

అదే సమయంలో లెక్కలు తేడా వస్తే ఎలా ఉంటుందన్నది ఇప్పటికే ఢిల్లీ.. పశ్చిమబెంగాల్.. కర్ణాటక.. .ఇలా లెక్కలేనన్ని రాష్ట్రాల్లో తమ సత్తా చూపిన మోడీషాలకు తెలంగాణ పెద్ద విషయం కాదంటున్నారు. ఈ కారణంతోనే తెలంగాణలో కనిపిస్తున్న తనిఖీల హడావుడి.. ఏపీలో మాత్రం కనిపించటం లేదని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News