కరోనా ఎఫెక్ట్.. 2023లో వర్క్ ఫ్రమ్ హోమ్..!

Update: 2022-12-26 05:55 GMT
కరోనాను ప్రపంచం కోలుకుంటుందని అంతా భావిస్తున్న తరుణంలో చైనాలో వెలుగు చూస్తున్న కొత్త కేసులు మానవాళిని మరోసారి కలవరానికి గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా చైనాలో కరోనా కేసుల లక్షల్లో నమోదవుతుండటంతో పాటు మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. చైనా అధికారికంగా మృతుల సంఖ్య వెల్లడించనప్పటికీ శ్మశాన వాటికలన్నీ కరోనా మృత దేహాలతో నిండిపోయినట్లు తెలుస్తోంది.

ఇక చైనాలోని ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. కొందరు రోగులకు బెడ్లు కూడా దొరకని దయనీయ పరిస్థితి చైనాలో దాపురించింది. గత 25 రోజుల్లో చైనాలో 25 కోట్ల మంది ప్రజలు ఒమ్రికాన్.. బిఎఫ్ 7 వైరస్ ల బారిన పడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చైనాలో జీరో కోవిడ్ విధానం ఎత్తివేయడం.. కోవిడ్ వాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన నిర్లక్ష్యమే ప్రస్తుత పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో చైనా చుట్టుపక్కల దేశాలు కరోనా విషయంలో అప్రమత్తం అవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్.. భూటాన్.. పాకిస్తాన్.. కజకిస్తాన్.. రష్యా .. తజకిస్తాన్.. వియత్నంతో పాటుగా ఇండియా.. అమెరికా దేశాలు ప్రజలను అలర్ట్ చేశాయి. ప్రజలంతా మళ్లీ కరోనా నిబంధనలు పాటించాలని.. మాస్కులు ధరించాలని సూచనలు చేశాయి. అంతేకాకుండా వ్యాక్సిన్ డ్రైవ్ పై కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నాయి.

కరోనా పరిస్థితుల దృష్ట్యా బడా కంపెనీలన్నీ మళ్లీ వర్క్ ఫ్రం హోంపై ఆలోచనలు చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం కరోనా కారణంగా కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అలవాటు చేశాయి. దీంతో రెండేళ్లుగా వారంతా ఆ కల్చర్ కు బాగా అలవాటు పడిపోయారు. ఆ తర్వాత కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్ని కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీస్ నుంచి పనులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అయిష్టంగానే ఉద్యోగులంతా తిరిగి కార్యాలయాల నుంచి పనులు చేస్తున్నారు.

ఇప్పుడిప్పుడే మళ్లీ ఈ వ్యవస్థ గాడిలో పడుతున్న సమయంలో చైనాలో కరోనా కేసులు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. కరోనాపై కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అలర్ట్ చేస్తున్న నేపథ్యంలో కంపెనీలు సైతం ఉద్యోగులకు తిరిగి వర్క్ ఫ్రం హోం ఆఫర్ ను ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. భారత్ లోనూ కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోం.. హైబ్రిడ్ మోడల్ లో పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

భారత్ లోని  ఫ్లిప్కార్ట్.. మారికో.. ఎల్ అండ్ టీ మైండ్ ట్రీ.. టాటా స్టీల్..  బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కంపెనీలతో పాటు పలు దిగ్గజ కంపెనీలన్నీ కొత్త ఏడాదిలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. లేదా హైబ్రిడ్ మోడల్ ను ఆఫర్ చేస్తున్నాయి. ఇకపై ఉద్యోగుల ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని.. వర్క్ ఫ్రం హోం పని చేసుకోవచ్చని చెబుతున్నాయి. ఈ సదుపాయంతో ఉద్యోగులకు ఆఫీస్ వర్క్ తో పాటు పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చని అవకాశం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News