జగన్ కలను నిజం చేసిన ఆ కోర్టు

Update: 2019-12-19 05:00 GMT
మహిళలపై అత్యాచారాలు.. దారుణమైన నేరాలకు పాల్పడిన నిందితులకు స్వల్ప వ్యవధిలో కఠిన శిక్షలు వేయాలన్న స్వప్నాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చెప్పటం తెలిసిందే. దీనికి అనుగుణంగా ఏపీ దిశ చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించటం తెలిసిందే. అతి స్వల్ప వ్యవధిలో నేరం చేసిన వారి విషయంలో కోర్టులు తీర్పులు చెప్పాలన్నదే ఏపీ దిశ చట్టం లక్ష్యమన్నది మర్చిపోకూడదు.

జగన్ తీసుకొచ్చిన దిశ చట్టాన్ని దేశంలోని పలు రాష్ట్రాల వారు తాము కూడా అదే చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటనలు చేస్తున్న పరిస్థితి. ఏపీ అసెంబ్లీ ఆమోదించిన ఈ చట్టాన్ని కేంద్రం ఓకే చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. రాజస్థాన్ కు చెందిన కోర్టు ఒకటి.. సీఎం జగన్ కోరుకున్నట్లే అతి తక్కువ వ్యవధిలోనే ఒక నిందితుడ్ని దోషిగా గుర్తించటమే కాదు.. కఠినమైన శిక్షను విధించిన వైనం సంచలనంగా మారింది.

రాజస్థాన్ లోని చురు ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. ఈ ఉదంతం వెలుగుచూసిన రోజే నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ఐపీసీ సెక్షన్లతో పాటు.. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నవంబరు 30న జరిగిన ఈ ఉదంతానికి సంబంధించిన ఛార్జిషీటును డిసెంబరు 7న పోలీసులు సమర్పించారు.

ఈ కేసుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం విచారించింది. దారుణమైన నేరానికి పాల్పడిన మేఘ్వాల్ ను దోషిగా తేల్చింది న్యాయస్థానం. నేరం చేసిన 17 రోజుల వ్యవధిలోనే కోర్టు విచారణను పూర్తి చేయటమే కాదు.. అతడికి యావజ్జీవకారాగార శిక్షను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలు కీలకభూమిక పోసించాయని చెబుతున్నారు. దారుణమైన నేరాలకు పాల్పడే వారికి రోజుల వ్యవధిలోనే శిక్ష పడాలన్న ఏపీ సీఎం జగన్ కోరికను.. రాజస్థాన్ కోర్టు నిజం చేయటమే కాదు.. అదేమీ అసాధ్యమైన విషయం కాదన్నది తేల్చారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News