దేశంలో తొలి స్పుత్నిక్ టీకా ఇవాళ వేశారు.. ఎక్కడో తెలుసా?

Update: 2021-05-14 10:34 GMT
మరో వారంలో విపణిలోకి వచ్చేస్తుందని చెప్పిన రష్యాకు చెందిన స్పుత్నిక్ - వీ వ్యాక్సిన్ ఈ రోజున ఒకరికి ప్రయోగాత్మకంగా వేసేశారు. రష్యా నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాలన్న ప్లానింగ్ లో ఉన్న ఈ టీకా తొలి డోస్ ఈ రోజున (శుక్రవారం) హైదరాబాద్ లో వేశారు. స్పుత్నిక్ తొలి డోస్ ను డాక్టర్ రెడ్డీస్ కస్టమ్ ఫార్మా సర్వీసెస్ గ్లోబల్ హెడ్ దీపక్ సప్రా తీసుకున్నారు. ఈ సందర్భంగా టీకా ధరను కూడా నిర్ణయించటం తలెిసిందే.

రష్యా నుంచి దిగుమతి చేసుకున్న టీకా ధరను ఐదు శాతం జీఎస్టీతో కలిసి రూ.995.40గా నిర్ణయించారు. దేశంలో కరోనా తీవ్రమవుతున్న వేళ.. వైరస్ ను ఎదుర్కొనటంలో వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని.. దేశంలోని అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తమ వంతు పాత్ర పోషించనున్నట్లుగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఎండీ జీవీ ప్రసాద్ తెలియజేశారు.

ఈ టీకాను తొలి విడతలో 1.5లక్షల వ్యాక్సిన్లు హైదరాబాద్ కు చేరుకున్నాయి. ఈ టీకాల వినియోగానికి సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ నుంచి నిన్న (గురువారం, మే 13న) అనుమతి వచ్చింది. ఈ రోజున రెడ్డీ ల్యాబ్స్ కు చెందిన కీలక అధికారికి వ్యాక్సిన్ వేయటం ద్వారా.. దేశంలో స్పుత్నిక్ - వీ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైందని చెప్పాలి.  దేశ వ్యాప్తంగా డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ తో పాటు.. గ్లాండ్ ఫార్మా.. హెటిరో బయో ఫార్మా.. పనాకీ బయోటెక్.. స్టెలిస్ బయో ఫార్మా.. విర్చో బయోటెక్ సంస్థలతో కలిసి మన దేశంలో ఏటా 85 కోట్ల డోసుల వ్యాక్సిన్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ లో అత్యధిక ప్రభావవంతమైనదిగా దీనికి పేరుంది. దీని ప్రభావశీలత 91 శాతంగా క్లినికల్ ట్రయల్స్ స్పష్టం చేస్తున్నాయి. స్పుత్నిక్ టీకా మొదటి డోస్ తీసుకున్న తర్వాత మూడు వారాల వ్యవధిలో రెండో టీకా తీసుకోవాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో రష్యా నుంచి 10 కోట్ల డోసుల్ని దిగుమతి చేసుకోనున్నారు.
Tags:    

Similar News