కరోనాను జయించే కిటుకు చెప్పేసిన పెద్దమనిషి

Update: 2021-07-02 23:30 GMT
కీలక వ్యాఖ్య చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అథనోమ్. కరోనా ఆరంభం నుంచి ఇటీవల కాలం వరకు కరోనా ఎపిసోడ్ లో  ఎప్పుడేం చేయాలన్న విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలకంగా వ్యవహరించకపోవటం కూడా మహమ్మారి ఇంతలా వ్యాపించటానికి కారణమన్న మాట వినిపిస్తూ ఉంటుంది. మొదటి.. రెండో వేవ్ తో ప్రపంచంలోని చాలా దేశాలు ఎంతలా నష్టపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటివేళ.. ఆయన కీలక విషయాన్ని వెల్లడించారు.

కరోనా మీద విజయం సాధించాలంటే ఈ సెప్టెంబరు లోపు దేశ జనాభాలో పది శాతం మందికి వ్యాక్సిన్ వేస్తే.. మహమ్మారిని నియంత్రించొచ్చని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి దేశ జనాభాలో 40 శాతం మందికి.. వచ్చే ఏడాది జూన్ నాటికి 70 శాతం మందికి టీకా అందించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రపంచంలో కరోనాను అంతం చేసి.. ఆర్థిక వ్యవస్థల్ని పరుగులు తీయించటానికి ఉన్న ఒకే ఒక్క మార్గం అదేనని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ విషయంలో కొన్ని దేశాల్లో అధిక శాతం జనాభాకు అందించగలిగితే.. కొన్ని దేశాల్లో మాత్రం చాలా తక్కువ శాతం మందికే టీకాలు వేశారన్నారు. ఈ అసమానతలే కరొనో వ్యాప్తికి కారణమన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిని అన్నిచోట్ల అంతం చేయాల్సిన అవసరం ఉందని.. లేకుంటే అందరికి ప్రమాదకరమన్న హెచ్చరికను ఆయన జారీ చేశారు.

టీకాలు వేసుకున్న వారిని ఏ దేశానికైనా అనుమతించాలన్నారు. ఏ టీకా వేసుకున్నా ఆయా దేశాలు వారిని అనుమతించాలని.. లేకుంటే దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థల మీద ఇది మరింత ప్రభావం చూపిస్తుందన్నారు. ఓవైపు చైనా.. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్లను ఐరోపా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వేళ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచన చేయటం గమనార్హం. మరి.. దీనిపై ప్రపంచ దేశాలు ఎలా రియాక్టు అవుతాయో చూడాలి.
Tags:    

Similar News