128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్.. క్రికెట్.. 4500 కిలోమీటర్ల దూరం..

పైగా అంతర్జాతీయ క్రికెట్ కమిటీ కూడా క్రికెట్ ను మిగతా క్రీడాంశాలు ఉండే టోర్నీల్లో కలిపేందుకు ఇష్టపడినట్లు కనిపించదు.

Update: 2024-11-15 21:30 GMT

ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన క్రీడ ఫుట్ బాల్ కావొచ్చు.. అత్యంత వ్యూయర్ షిప్ ఉండే క్రీడ క్రికెట్ కావొచ్చు.. కానీ, అత్యంత విజయవంతమైన టోర్నీ ఏదంటే మాత్రం ఒలింపిక్సే. ఫుట్ బాల్, టెన్నిస్ వంటి ఫేమస్ స్పోర్ట్స్ కు ఒలింపిక్స్ లో అవకాశం ఉంది. హాకీ వంటి వాటికీ చోటుంది. కానీ, ఒలింపిక్స్ లో క్రికెట్ అంటే..? దీనికి సమాధానం లేదు. అసలు కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు ఇలా వేటిలోనూ క్రికెట్ కు చోటుండదు. కారణం.. సమయం ఎక్కువ పట్టడం. పైగా అంతర్జాతీయ క్రికెట్ కమిటీ కూడా క్రికెట్ ను మిగతా క్రీడాంశాలు ఉండే టోర్నీల్లో కలిపేందుకు ఇష్టపడినట్లు కనిపించదు.

128 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు..

ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలనేది ఎప్పటినుంచో ఉన్న డిమాండ్. ఈ ప్రయత్నాలు ఫలించి 2028లో అమెరికాలో జరిగే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ లో చేర్చారు. చివరిగా 1900లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు కల్పించారు. మళ్లీ ఇప్పుడే. అయితే,

తాజాగా వచ్చిన ఓ వార్త మాత్రం అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తోంది.

అమెరికా క్రికెట్ కు దూరం

సహజంగానే అమెరికా క్రికెట్ కు దూరం. ఆసియా, ముఖ్యంగా భారత సంతతి వారి ప్రాబల్యం పెరగడంతో ఇప్పుడిప్పుడే అక్కడా క్రికెట్ ఆడుతున్నారు. దీంతోపాటు 2028 లాస్ ఏంజిలెస్‌ ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు దక్కడంతో ఆతిథ్య దేశంగా అమెరికా జట్టు పాల్గొనడం ఖాయం. మరోవైపు ఇటీవలి టి20 ప్రపంచ కప్ లో అమెరికా జట్టు తొలిసారి బరిలో దిగి దుమ్మురేపింది. మాజీ చాంపియన్ పాకిస్థాన్ కే షాకిచ్చింది. ఇప్పుడు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ నాటికి మరింత మెరుగవనుంది. కానీ, అక్కడ క్రికెట్‌ ఆడేందుకు సరైన మైదానాలు లేవు. దీంతో మ్యాచ్ లను న్యూయార్క్‌ లో నిర్వహించాలని ఒలింపిక్స్‌ కమిటీ నిర్వాహకులు ఆలోచిస్తున్నారు.

ఆ చివర నుంచి ఈ చివరకు..

చాలా పెద్ద దేశమైన అమెరికాలో.. లాస్ ఏంజిలెస్‌ ఓ చివరన ఉంటే.. న్యూయార్క్‌ ఈ చివరన ఉంటుంది. రెండింటికీ మధ్య దాదాపు 3వేల మైళ్ల దూరం ఉంటుంది (అంటే 4,500 కిలోమీటర్లు). ‘‘లాస్ ఏంజిలెస్‌ లో సరైన క్రికెట్ వేదికలు లేవని లాస్ ఏంజిలెస్‌ ఒలింపిక్స్‌ చైర్మన్ వాసర్‌ మెన్ తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో మంచి మైదానాలు దొరికితే.. ఇక్కడే నిర్వహిస్తామన్నారు.

టి20 ప్రపంచ కప్ లో ప్చ్..

అమెరికా-వెస్టిండీస్ దీవుల వేదికగా ఈ ఏడాది జూన్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ ను భారత్ గెలుచుకుంది. అయితే, ఈ ప్రపంచకప్‌ మ్యాచ్‌లు కొన్ని న్యూయార్క్‌ లో జరిగాయి. తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. ప్రేక్షకాదరణ మాత్రం బాగుంది. దీంతో ఒలింపిక్‌ అధికారులు న్యూయార్క్ స్టేడియం మేనేజ్‌ మెంట్‌ తో మాట్లాడుతున్నారు. కాగా, సాఫ్ట్‌ బాల్‌, కానోయ్‌ ను కూడా దాదాపు 1,300 మైళ్ల దూరంలోని ఓక్లహామాలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News