70 ఏళ్ల ఏజ్.. 8 గంటల అరెస్ట్.. రూ.10.3 కోట్ల క్రైమ్ @ ఢిల్లీ!
ఈ విషయంలో ఎవరికి వారే వీలైనంత అప్రమత్తంగా ఉండాలనే సూచనలు వినిపిస్తున్నాయి.
ఇటీవల కాలంలో సైబర్ నేరాలకు సంబంధించి ఘటనలు నిత్యం ఏదో ఒక మూలా భారీఎత్తున తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. వెలుగులోకి రాకుండా ఇంకా ఎన్ని ఉంటున్నాయనేదీ పెద్ద ప్రశ్నే! ఈ విషయంలో పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. రూపాలు మార్చుకుంటూ సైబర్ క్రైమ్ మహమ్మారి రోజు రోజుకీ విజృంభిచేస్తోంది.
ఈ విషయంలో ఎవరికి వారే వీలైనంత అప్రమత్తంగా ఉండాలనే సూచనలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో... 70 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ ను సుమారు ఎనిమిది గంటల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి రూ.10.3 కోట్లు కొల్లగొట్టిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. బాధితుడు పోలీసులు ఆశ్రయించారు.
అవును... ఢిల్లీలోని రోహిణీ ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ కు ముంబై పోలీస్ అధికారులం అని చెప్పి ఫోన్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఈ సందర్భంగా... మీ పేరు మీద డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని బెదిరింపులకు దిగారు. వీడియో కాల్ కోసం స్కైప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించి.. మొబైల్ కి ఓ లింక్ పంపారని అంటున్నారు.
అక్కడ నుంచి బాధితుడి ఫోన్ ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న సైబర్ నేరగాళ్లు.. అతడి వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం సేకరించారు. ఈ సందర్భంగా ఒక గదిలో కూర్చుని మొబైల్ లేదా ల్యాప్ ట్యాప్ కెమెరా ముందు కూర్చోవాలని బెదిరించారు. అనంతరం మరో గ్రూపు ఫోన్ చేసి సాయం చేస్తామంటూ లైన్ లోకి వచ్చి రూ.10.30 లక్షల నగదును ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు.
అనంతరం సుమారు ఎనిమిది గంటల పాటు సైబర్ అరెస్ట్ అనంతరం విడిచి పెట్టారు! దీంతో.. విషయం గ్రహించిన బాధితుడు లబోదిబో అంటూ భోరుమన్నాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. దీంతో... రంగంలోకి దిగిన పోలీసులు.. సుమరు రూ.60 లక్షలను స్తంభింపచేశారని అంటున్నారు. మిగిలిన మొత్తాన్ని రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు!