పెరిగిపోతున్న ఆహార సంక్షోభం

Update: 2022-05-05 06:03 GMT
ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఆహార సంక్షోభం పెరిగిపోతోంది. గతంలో ఎప్పుడూ లేనంత తీవ్రంగా కొన్ని దేశాల్లో ఆహార కొరత బాగా పెరిగిపోతున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆహార నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో జరుగుతున్న మార్పులు, సాయుధ సంఘర్షణలు,  కరోనా వైరస్ కారణంగా ఆహార ఉత్పత్తిపై పెద్ద ప్రభావం పడింది. ఇవి సరిపోనట్లుగా వీటికి అదనంగా తాజాగా జరుగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా తయారైంది.

2021 సంవత్సరంలో 53 దేశాల్లోని సుమారు 20 కోట్లమంది ప్రజలు తీవ్రమైన ఆహారం కొరతతో అల్లాడిపోయారు. ప్రస్తుత ఆహార సంక్షోభానికి ఆర్థిక సంక్షోభం కూడా పెద్ద కారణమనే అని ఐక్యరాజ్యసమితి ఆహార నిపుణుల అధ్యయనంలో బయటపడింది.

ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సంఖ్య ప్రతి ఏడాది పెరిగిపోతుండటం. రెగ్యులర్ గా సంఘర్షణలు జరుగుతున్న ఆఫ్ఘనిస్థాన్, కాంగో, సోమాలియా, ఇథియోపియా, నైజీరియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమెన్ దేశాల్లో ఆహార కొరత పెరిగిపోతోంది.

సోమాలియాలో జరుగుతున్న అంతర్గత సంఘర్షణలు, తీవ్ర అనావృష్టి, ద్రవ్యోల్భణం, కరోనా వైరస్ సమస్య  కారణంగా ఈ ఏడాదే 60 లక్షల మందిపై ఆహార కొరత ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని నివేదికలు చెప్పాయి. ప్రపంచంలోని చాలా దేశాలకు గోధుములు, వంటనూనెలు, ఎరువులు ఉక్రెయిన్, రష్యా నుండే ఎగుమతువున్నది.

గడచిన రెండు నెలలుగా జరుగుతున్న యుద్ధం కారణంగా పై రెండు దేశాల నుండి ఎగుమతులు ఆగిపోయాయి. ఈ కారణంగా కూడా నిత్యావసరాలకు కొరత పెరిగిపోవటం, ఒక్కసారిగా వాటి ధరలు ఆకాశానికి ఎగబాకటం వల్ల ఆహారసంక్షోభం పెరిగిపోయింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీలంకలో పరిస్ధితులే.

సంక్షోభం చుట్టుముట్టినంత తొందరగా ఆహార ఉత్పత్తిని పెంచే అవకాశం లేదని అందరికీ తెలిసిందే. అందుకనే రాబోయే పంట సీజన్లలో దేశాలు ఆహార ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి ఆహార నిపుణులు నెత్తినోరు మొత్తుకుంటున్నారు. అయితే ఎన్ని దేశాలు వీళ్ళ హెచ్చరికలను పట్టించుకుంటాయన్నదే పెద్ద సమస్య.
Tags:    

Similar News