ఏపీ రాజధాని పై కీలక నిర్ణయం తీసుకున్న హైపవర్ కమిటీ ...!

Update: 2020-01-13 08:18 GMT
ఏపీ ప్రభుత్వం రాజధాని ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ నేడు మరోసారి భేటీ అయ్యింది. ఇప్పటికే మూడు కమిటీలిచ్చిన నివేదికలను అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ సోమవారం మరోసారి సమావేశమైంది. తొలి సమావేశంలో బోస్టన్ గ్రూపు, జీఎన్ రావు కమిటీలిచ్చిన నివేదికలపై చర్చించిన హైపవర్ కమిటీ, రెండో సమావేశంలో అమరావతి ఏరియా ప్రజల సమస్యలను, వారి అపోహలను చర్చించింది. సోమవారం మూడో దఫా సమావేశమైన హైపవర్ కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది.

అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రజలు.. మరీ ముఖ్యంగా రైతాంగం తాము భూములను త్యాగం చేసి నష్టపోయామని భావిస్తున్న నేపథ్యంలో వారి ఆందోళనకు రాజకీయ పార్టీల వ్యూహాలు తోడయ్యాయి. తాము రాజధాని కోసం భూములిస్తే, ఇప్పుడు రాజధానినే తరలిస్తే తాము అటు భూములు కోల్పోయి, ఇటు రాజధాని కోల్పోయి రెంటికి చెడ్డ రేవడిగా మారతామని అమరావాతి ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో అమరావతి ఏరియా ప్రజల అభిప్రాయాలను సేకరించాలని హైపవర్ కమిటీ సోమవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈనెల 17వ తేదీ సాయంత్రం వరకు అమరావతి ఏరియా ప్రజలు హైపవర్ కమిటీకి తమ అభిప్రాయాలను తెలపవచ్చని రాష్ట్ర మంత్రి పేర్ని నాని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితిలో అమరావతి ఏరియా ప్రజలకు అన్యాయం చేయాలని ఎందుకు కోరుకుంటుందని నాని ప్రశ్నించారు. అందుకే అమరావతి ఏరియా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని, వారికి సంపూర్ణ న్యాయం చేయాలన్నదే హైపవర్ కమిటీ అభిప్రాయమని, దానికి కోసమే ఈనెల 17వ తేదీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని మంత్రి పేర్ని నాని తెలిపారు.

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కొడాలి నాని, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌,  ప్రభుత్వ సలహాదారుడు అజేయ్‌ కల్లాం, సీఎస్‌ నీలం సాహ్ని, వివిధ శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. అలాగే ఈనెల 17న సాయంత్ర హైపవర్ కమిటీ మరోసారి సమావేశం కానుంది.
Tags:    

Similar News