ఆ రెండు జిల్లాలపైనే రెండుపార్టీల ఆశలు

Update: 2021-04-13 11:30 GMT
పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో పోటీ తారాస్ధాయికి చేరుకుంటోంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు జరిగిన పోటీ ఒకఎత్తు. ఇకపై జరగబోయే పోలింగ్ ఒకఎత్తుగా మారిపోయింది.  బెంగాల్లో జరగాల్సిన ఎనిమిది దశల పోలింగ్ లో ఇప్పటివరకు నాలుగుదశలు మాత్రమే జరిగాయి. మిగిలిన నాలుగు దశలపోలింగ్ లో కూడా ఇపుడు మమతబెనర్జీ, నరేంద్రమోడి ప్రధానంగా రెండు జిల్లాలపైన మాత్రమే దృష్టి పెట్టారు.

ఇంతకీ ఆ రెండు జిల్లాలపైనే ఎందుకింతగా ఇద్దరు దృష్టిపెట్టారు ? ఎందుకంటే రెండు జిల్లాల్లోనే 64 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి కాబట్టి.  ఇంతటి చర్చకు కారణమైన ఆ రెండు జిల్లాలు ఏవంటే ఉత్తర 24 పరగణా, దక్షిణ 24 పరగణా జిల్లాలు. మొదటినుండి ఈ రెండు జిల్లాలు వామపక్షాలకు బాగా పట్టున్నవి. అయితే అప్పుడెప్పుడో జరిగిన సింగూర్, నందిగ్రామ్ ఉద్యమాల ఫలితంగా మిగితా ప్రాంతాల్లో లాగే ఇక్కడ కూడా మమతబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాగావేసింది.

2011, 2016 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీదే పై చేయి. ఉత్తర 24 పరగణా జిల్లాలోని 33 అసెంబ్లీల్లో టీఎంసి 2016లో 27 నియోజకవర్గాల్లో గెలిచింది. అలాగే దక్షిణ 24 పరగణా జిల్లాలోని 31 నియోజకవర్గాల్లో టీఎంసి 29 చోట్ల అధికారపార్టీ గెలిచింది. అయితే తర్వాత 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికలో ఉత్తరపరగణా జిల్లాలో ఉన్న ఐదు స్ధానాల్లో బీజేపీ 2 చోట్ల గెలిచింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ఎంఎల్ఏల్లో ఐదుగురితో పాటు కొందరు సీనియర్లను బీజేపీ ఆకర్షించింది.

నార్త్ 24 పరగణా జిల్లాలోని 33 నియోజకవర్గాల్లో 14 చోట్ల మధువ తెగలే నిర్ణయాత్మకం. ఈ విషయం రెండు పార్టీల నేతలకు బాగా తెలియటంతోనే వాళ్ళని ఆకర్షించేందుకు నానా అవస్తలు పడుతున్నారు. ఇందులో భాగంగానే నరేంద్రమోడి ఈ మధ్యే బంగ్లాదేశ్ పర్యటనలో పై తెగ ఎక్కువుండే ప్రాంతంలో పర్యటించారు. పైగా ఈ జిల్లాలో ముస్లింల జనాభా కూడా ఎక్కువే. అందుకనే టీఎంసితో పాటు కాంగ్రెస్ కూటమిలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ గట్టిగా ప్రచారం చేసుకుంటోంది.

పై రెండు జిల్లాలకు బంగ్లాదేశ్ సరిహద్దులు ఉండటం బెంగాల్ కు ఒకవిధంగా అడ్వాంటేజ్ మరోరకంగా సమస్యాత్మకమనే చెప్పాలి.  ఇంతటి ప్రత్యేకతలు ఉన్న జిల్లాలు గనుకే ఈ జిల్లాలపై అన్నీపార్టీలు పట్టుకోసం పెద్దగా పోరాడుతున్నాయి. మరి ఓటర్లు ఎవరిని కరుణిస్తారో చూడాల్సిందే.
Tags:    

Similar News