రూ.6 కోట్లు గెలుచుకున్న లాట‌రీ టిక్కెట్ అడక్కుండానే ఇచ్చేసింది!

Update: 2021-03-28 01:30 GMT
అవకాశం దొరికితే చెప్పులు కూడా ఎత్తుకుపోయే బ్యాచ్ లు తిరిగే ఇదే సొసైటీలో.. త‌న‌ది కానిది పైసా కూడా ముట్టుకోని నిజాయితీ ప‌రులు కూడా ఉన్నారు. వాళ్ల సంఖ్య అత్య‌ల్పం. కానీ.. వారి నిజాయితీ చూస్తే మాత్రం దండం పెట్టేస్తారు. బ్యాగులు.. బంగారం.. ఇలా త‌మ‌కు ఏది దొరికినా తీసుకెళ్లి పోలీసుల‌కు అప్ప‌గించే వాళ్ల‌ని అరుదుగా చూస్తుంటాం. కానీ.. ఇక్క‌డ మ‌నం చెప్పుకోబోయే మ‌హిళ‌ను మాత్రం బ‌హుశా చూసి ఉండ‌క‌పోవ‌చ్చు. ఏకంగా రూ.6  కోట్ల‌ను ఇచ్చేసింది!

కేర‌ళ‌కు చెందిన స్మిజా మోహ‌న్ అనే నిరుపేద మ‌హిళ లాట‌రీ టిక్కెట్లు విక్ర‌యిస్తూ జీవ‌నం గ‌డుపుతోంది. మొత్తం అమ్మ‌గా.. ఓ ప‌దీ ప‌న్నెండు టిక్కెట్లు త‌న వ‌ద్ద మిగిలిపోయాయి. ఎవ్వ‌రూ కొనుగోలు చేయ‌క‌పోవ‌డంతో త‌న‌కు తెలిసిన క‌స్ట‌మ‌ర్ కు ఫోన్ చేసి టిక్కెట్లు కొనాల‌ని అడిగింది. దీంతో.. ఫోన్లోనే అత‌డు కొన్ని నంబ‌ర్లు చెప్పి, వాటిని కొనుగోలు చేస్తాన‌ని చెప్పాడు. అయితే.. ఆ త‌ర్వాత అత‌ను స్మిజాను క‌ల‌వ‌లేదు. దీంతో టిక్కెట్లు ఆమె వ‌ద్ద‌నే ఉండిపోయాయి.

తీరా చూస్తే.. అత‌ను చెప్పిన నంబ‌ర్ల‌లోని ఓ టిక్కెట్ లాట‌రీ త‌గిలింది. ఏకంగా రూ.6  కోట్లు వ‌చ్చాయి. నిజంగా ఆమె గ‌న‌క ఆ డ‌బ్బులు తీసుకోవాల‌ని అనుకుంటే.. స‌ద‌రు టిక్కెట్ త‌న వ‌ద్ద లేద‌ని, ఎక్క‌డో మిస్స‌య్యింద‌ని ఏదో చెప్పొచ్చు. ఆ త‌ర్వాత ఆ మొత్తం డ‌బ్బులు కూడా కాజేయొచ్చు. కానీ.. ఆమె ఆ ప‌నిచేయ‌లేదు. నిజాయితీగా ఆ టిక్కెట్ ను క‌స్ట‌మ‌ర్ కు అప్ప‌గించింది.

ఉద్యోగం కోల్పోవ‌డంతో.. లాట‌రీ టిక్కెట్లు అమ్ముకుంటూ జీవితం వెళ్ల‌దీస్తున్న‌ట్టు చెప్పారు స్మిజా. అలాంటి క‌ఠిన ప‌రిస్థితుల్లో కూడా త‌న నిజాయితీని వ‌దులుకోలేదు ఆమె. ఆ టిక్కెట్ క‌స్ట‌మ‌ర్ కు ఇవ్వ‌డంతో అత‌ను ప్రైజ్ మ‌నీ అందుకున్నాడు. నిజంగా.. ఎంత గొప్ప వ్య‌క్తిత్వ‌మో క‌దా..!
Tags:    

Similar News