లైంగిక ‌దాడి కేసుః బాధితురాలితో రాఖీ క‌ట్టించుకుంటే బెయిల్ ఇస్తామ‌న్న హైకోర్టు!

Update: 2021-03-19 01:30 GMT
న్యాయ‌స్థానాలు ఇస్తున్న కొన్ని తీర్పులు చూస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. మొన్న‌టికి మొన్న లైంగిక దాడి కేసులో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించింది. మహిళల శరీరానికి పురుషుల శరీరం తాకితేనే లైంగిక వేధింపుల కిందకు వస్తుందని, దుస్తుల పైనుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపుల పరిధిలోకి రాదని తీర్పు చెప్పింది.

అంతేకాకుండా.. మైనర్ల విషయంలో వారి ఎదభాగాన్ని తాకినంత మాత్రాన లైంగికంగా వేధించినట్లు కాదని, దుస్తులు లేకుండా తాకితేనే వేధింపులుగా పరిగణించాలని పేర్కొంది. తీర్పులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే.  ఈ తీర్పులు వెలువరించిన న్యాయమూర్తి ప్రమోషన్ కూడా పెండింగ్ లో ఉంచింది కేంద్రం.

తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు మరో వివాదాస్పదమైన తీర్పు వెలువరించింది. ఓ యువతిపై లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న విక్రమ్ అనే నిందితుడి బెయిల్ పిటిషన్ విచారించిన న్యాయస్థానం.. వింత వ్యాఖ్యలు చేసింది. బాధితురాలితో రాఖీ కట్టించుకొని, ఆమెకు జీవితాంతం రక్షణగా ఉంటానని హామీ ఇవ్వాల‌నే ష‌ర‌తుతో బెయిల్ మంజూరు చేయ‌డం గ‌మ‌నార్హం.

సంచ‌ల‌నం రేకెత్తించిన ఈ తీర్పుపై న్యాయ‌వాదుల నుంచే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును స‌వాల్ చేస్తూ తొమ్మిది మంది మ‌హిళా లాయ‌ర్లు సుప్రీం కోర్టు త‌లుపు త‌ట్టారు. ఈ తీర్పును స‌మీక్షించిన‌ సుప్రీం.. హైకోర్టుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రాఖీ క‌డితే.. లైంగిక దాడికి పాల్ప‌డిన‌ నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తారా? అని ప్ర‌శ్నించింది. అనంత‌రం బెయిల్ ను ర‌ద్దు చేస్తున్న‌టు తీర్పు చెప్పింది.
Tags:    

Similar News