జస్టిస్ రమణ అలా చేస్తే.. మీరు ఇలా చేయటమా కేసీఆర్?

Update: 2021-06-20 23:30 GMT
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్ లో కొన్ని రోజులు ఉండటం తెలిసింది. సుప్రీంకోర్టు సెలవుల నేపథ్యంలో సీజేఐ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చారు. ఆయనకు అపూర్వ స్వాగతం పలకటమే కాదు.. తెలంగాణ సమాజం ఆయన్ను కలిసేందుకు పోటెత్తింది. అన్ని వర్గాలకు చెందిన వారు ఆయన్ను కలిసి.. తమ ఆనందాన్ని.. సంతోషాన్ని తెలియజేశారు. అదేసమయంలో.. తన పర్యటన సందర్భంగా జస్టిస్ రమణ వ్యవహరించిన తీరు పలువురిని ఆకట్టుకుంది.

ఎస్ఆర్ నగర్ లోని తన సొంతింటికి వెళ్లే క్రమంలో ట్రాఫిక్ మొత్తాన్ని ఆపేసిన వైనాన్ని గమనించిన జస్టిస్ రమణ.. పోలీసు వారికి ఒక సూచన చేశారు. తన కారణంగా ట్రాఫిక్ ను ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దని.. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని కోరారు. అంతేకాదు.. తనకు అవసరమైతే చెబుతానని.. తాను కూడా సామాన్యులతో పాటు రోడ్డు మీద ప్రయాణిస్తానని చెప్పారు. అత్యున్నత స్థానంలో ఉండి.. తన గురించి సామాన్యులు ఎవరూ ఇబ్బంది పడొద్దని చెప్పిన జస్టిస్ రమణ మాటతోపలువురు ఫిదా అయ్యారు.

కట్ చేస్తే.. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కామారెడ్డిలో పర్యటించారు. అక్కడ నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని.. ఎస్పీ భవనాన్ని ప్రారంభించారు. దీంతో పాటు సిద్దిపేటలోనూ ఆయన పర్యటించారు. అయితే.. సిద్ధిపేటలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతంలో భద్రతా సమస్యలు వస్తాయని.. కరెంటు కట్ చేయటం.. ఆయన ప్రయాణించే ప్రాంతంపైన ప్రమాదకరమని భావించిన విద్యుత్ వైర్లను తొలగించటం షాకింగ్ గా మారింది.

నిజంగానే భద్రతాపరమైన సమస్యలు ఉంటే.. ఆ ప్రాంతంలో పర్యటించాల్సిన అవసరమే లేదు. ఇదంతా భద్రత పేరుతో టీఆర్ఎస్ నేతలు.. అధికారులు.. పోలీసుల అత్యుత్సాహంగా పలువురు అభివర్ణిస్తున్నారు. సీజేఐ లాంటి అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారే సామాన్యులకు ఏ మాత్రం ఇబ్బంది కలగకూడదని భావిస్తున్న రోజుల్లో ఇలా జరగటమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరీ విషయం కేసీఆర్ వరకు వెళ్లిందా? అన్నది ప్రశ్న. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ఇలాంటివి చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.




Tags:    

Similar News