బ్రిటన్ ప్రధాని పదవికి అడుగు దూరానికి చేరుకున్న రిషి.. ఐదో రౌండ్లోనూ అధిక్యత

Update: 2022-07-21 05:15 GMT
భారత సంతతికి చెందిన రిషి సునక్ చరిత్ర  సృష్టించేందుకు మరో అడుగు మాత్రమే మిగిలి ఉంది. ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో.. బ్రిటన్ భావి ప్రధానిని ఎన్నుకునేందుకు ఇప్పటికి ఐదు రౌండ్లను నిర్వహించారు.

ఈ ఐదు రౌండ్లలోనూ రిషి సునక్ అధిక్యతను ప్రదర్శించారు. కీలకమైన ఐదో రౌండ్ లోనూ మిగిలిన పోటీదారుల కంటే ముందున్నఅతను.. ఐదో రౌండ్ లోనే స్పష్టమైన అధిక్యతను ప్రదర్శించారు.

ఐదో రౌండ్లో సునాక్ కు 137 ఓట్లు రాగా.. లిజ్ ట్రస్ కు 113 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో.. ప్రధాని పదవికి పోటీ పడుతున్న అభ్యర్థుల్లో రిషి సునాక్ ఒకరిగా నిలిచారు. ఆయనకు పోటీ ఇస్తారని భావించిన పెన్నీ మోర్డెంట్ తాజాగా ఎలిమినేట్ కావటంతో.. తుది పోరు రిషి.. లిజ్ ట్రస్ మధ్యనే ఉండనుంది. దీంతో చివరి రౌండ్ లో ఈ ఇద్దరు నేతల మధ్య పోరు తీవ్రతరంగా ఉండనుంది.

కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మెజార్టీ సభ్యుల్లో ఎక్కువ ఓట్లు ఎవరు రాబడితే వారే తదుపరి ప్రధాని అయ్యేది. ఈ క్రమంలో రిషి.. ఇప్పటివరకు ముందంజలో ఉన్నారు. ఇప్పటికే పలు సర్వేలు రిషికి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటివరకు సాగిన పోరులో  స్పష్టమైన అధిక్యతను ప్రదర్శించిన రిషి.. ఆఖరి రౌండ్ లోనే ఇదే జోరును ప్రదర్శిస్తే ఆయనే బ్రిటన్ కు తదుపరి ప్రధాని అవుతారు.

అదే జరిగితే.. భారత సంతతికి చెందిన వ్యక్తి.. భారత్ ను వందల ఏళ్లు పాలించిన బ్రిటీష్ ప్రభుత్వానికి అధినేత అయ్యే అరుదైన రికార్డును సొంతం చేసుకుంటారు. అయితే.. దీనికి సంబంధించి తుదిపోరులో రిషి ఇదే జోరును ప్రదర్శిస్తారని ఆశిద్దాం.
Tags:    

Similar News