పవన్ లోని అసలు లోపం ఏమిటో తెలుసా ?

Update: 2021-12-14 06:30 GMT
గెలవాలనే తపన లేకపోవటమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ లోని అసలు లోపం. ఎందులో అయినా గెలవాలంటే గెలుపుకు అవసరమైన సుదీర్ఘమైన కసరత్తు చాలా అవసరం. ముందు ప్రత్యర్ధుల్లోని బలము, బలహీనతల గురించి అధ్యయనం చేయాలి. ఆ తర్వాత మనలోని బలము, బలహీనతల గురించి నిజాయితీగా విశ్లేషించుకోవాలి. ప్రత్యర్ధిలోని బలాన్ని గుర్తించాలి. అప్పుడే ప్రత్యర్ధి బలాన్ని మనం ఎలా అధిగమనించాలనే వ్యూహం చేయవచ్చు.

ప్రత్యర్ధిని తక్కువ అంచనా వేయటం లేకపోతే ప్రత్యర్ధి బలాన్ని గుర్తించటానికి ఇష్టపడకపోవటం, ఏదో అదృష్టంకొద్దీ ఇంతకుముందు గెలిచాడని సర్దిచెప్పుకుంటే అంతే సంగతులు. ఇక్కడ వాస్తవం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ చేస్తున్న తప్పిదే. ఎంతసేపు ఏదో అదృష్టం మీద గెలిచిపోయాడు, జనాలను మోసం చేసి ఓట్లేయించుకున్నాడు, ఒక్క ఛాన్సంటే జాలిపడి గెలిపించారంటు ఇద్దరు కూడా సొల్లు కబుర్లు చెప్పుకుని తమను తాము తృప్తి పరుచుకుంటున్నారు.

చంద్రబాబు రాజకీయ జీవితమంటే దాదాపు చరమాంకానికి వచ్చేసినట్లే. ఇక్కడ సమస్యంతా పవన్ దే. పవన్లో లోపమేమిటంటే తాను గెలవాలనే తపన కన్నా జగన్ ఓడిపోవాలని కోరుకోవటమే. జగన్ ఓడిపోవాలని పవన్ కోరుకున్నంత మాత్రాన ఓడిపోడు. కానీ తాను గెలవాలనే తపన, పట్టుదలను చూపిస్తే ఏదో నియోజకవర్గంలో గెలిచే అవకాశాలున్నాయి. మనం గెలవాలనే తపన, పట్టుదలతో ఉంటే దానికి కనిపించే మార్గాలు వేరుగా ఉంటాయి. ప్రత్యర్ధి ఓడిపోవాలని కోరుకుంటే అప్పుడు కనబడే మార్గం వేరేగా ఉంటుంది.

మనలోని కోరికకు తగ్గట్లే మన దృష్టి పనిచేస్తుంది. మొన్నటి ఎన్నికల్లో ఎక్కడ రోడ్డుషోల్లో పవన్ మాట్లాడినా ‘జగన్ను ఎట్టిపరిస్ధితుల్లోను గెలవనిచ్చేది లేదం’టు పదే పదే చాలెంజ్ చేశారు. జగన్ గెలుపు గోల పవన్ కు ఎందుకు ? జగన్ మీద పెట్టిన దృష్టిలో సగం తన గెలుపుపై పెట్టుంటే ఎక్కడోచోట గెలిచేవాడేనేమో. అలాకాకుండా జగన్ పై నెగిటివ్ ప్రచారం చేయటంతో జనాలకు చిర్రెత్తి చివరకు పవన్నే రెండుచోట్లా ఓడగొట్టారు.

ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. పవన్ పాజిటివ్ రాజకీయాలు చేయాలి. జగన్ గురించి ఆలోచన మానేసి జనసేనను ఎలా బలోపేతం చేయాలి ? తాను ఎక్కడపోటీ చేయాలనే విషయంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే జగన్ గెలుపు, ఓటమి పవన్ చేతిలో లేదు. కానీ తాను గెలవాలని బలంగా అనుకుంటే కనీసం అందుకు తగ్గ ప్లాన్ అయినా వర్కవుట్ చేసుకోవచ్చు కదా. భగవంతుడి ఆశీర్వాదం ఉండాలంటే ముందు మన ప్రయత్నం అంటు ఉండాలి కదా.

Tags:    

Similar News