ఆర్యన్ ఖాన్ విడుదల ఆలస్యానికి అసలు కారణం తెలిసింది

Update: 2021-11-01 09:36 GMT
గురువారం బెయిల్ వస్తే శనివారం జైలు నుంచి విడుదలయ్యాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ కు కోర్టులో వరుసగా చుక్కెదురైంది. దాదాపు 27 రోజుల పాటు జైల్లో మగ్గారు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు దిగ్గజ లాయర్ ముకుల్ రోహత్ గీ బలమైన వాదన వినిపిండంతో గత శనివారం బెయిల్ పై విడుదలయ్యాడు.

నిజానికి గురువారమే బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ విడుదల ప్రక్రియ ఆలస్యం అవడంతో రెండు రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే ఈ ఆలస్యానికి కరెంట్ కోతలే కారణమని తెలిసింది. ఈ కేసులో మరో నిందితుడైన ఆర్భాజ్ మర్చెంట్ తండ్రి, సీనియర్ న్యాయవాది అస్లామ్ మర్చెంట్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నాడు.

డ్రగ్స్ కేసులో ఆర్యన్ సహా ఆర్భాజ్, మున్మున్ లకు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు గత గురువారం తీర్పు వెలువరించింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి ఉత్తర్వులను ఆ మరుసటి రోజు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు కోర్టు నుంచి అందడం ఆలస్యమవడంతో ఆర్యన్ శుక్రవారం రాత్రి కూడా జైల్లోనే ఉండాల్సి వచ్చింది.

కోర్టులో విద్యుత్ అంతరాయం కారణంగా రిలీజ్ మెమో ఆలస్యంగా వచ్చిందని అస్లామ్ తాజాగా వెల్లడించారు. ఆర్యన్ బెయిల్ కు సంబంధించి రిలీజ్ మెమో టైప్ చేస్తుండగా కోర్టులో పలు సార్లు కరెంట్ కట్ అయ్యింది. దాదాపు 25 నుంచి 35 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అందువల్ల ఆర్యన్ విడుదల ఉత్తర్వులు అతడి న్యాయ బృందానికి ఆలస్యంగా అందాయి. వారు సాయంత్రం 5.30 గంటలలోగా జైలుకు చేరుకోలేకపోయారు అని అస్లామ్ తెలిపారు.

శుక్రవారం కోర్టు ఉత్తర్వులు తీసుకొని షారుఖ్ న్యాయబృందం ఆర్థర్ రోడ్డు జైలుకు వెళ్లేసరికి నిర్ధిష్ట గడువు దాటిపోయింది. సమయం పొడిగించేందుకు జైలు అధికారులు అంగీకరించలేదు. శనివారం ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం ఉదయం 11 గంటలకు ఆర్యన్ ను అధికారులు జైలు నుంచి విడుదల చేశారు. ఇలా కరెంట్ కోతల వల్ల రెండు రాత్రులు ఆర్యన్ ఖాన్ జైలులోనే మగ్గాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.




Tags:    

Similar News