కాంగ్రెస్ నుంచి ఆ రాష్ట్రం చేజారుతుందా?

Update: 2019-05-13 08:54 GMT
దక్షిణాదిన ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఇక్కడ ఎప్పుడూ బలంగా లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ చేజేతులారా తనను తానే దెబ్బ తీసుకొంటూ వస్తోంది. ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఇచ్చి కాంగ్రెస్ తెరమరుగు అవుతోంది. ఉమ్మడి ఏపీని విడదీసి కాంగ్రెస్ పార్టీ తననకు తానే రెండు రాష్ట్రాల్లో దెబ్బేసుకుంది.

ఇక కర్ణాటకలో ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే అది సొంతంగా సాధించుకున్న అధికారం కాదు. ప్రజలు ఆ పార్టీని తిరస్కరించినా, అధికారం నుంచి దించేసినా.. కాంగ్రెస్ వాళ్లు, జేడీఎస్ తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఆ ప్రభుత్వం ఎలా నడుస్తోందో అందరికీ తెలిసిందే. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న ఆ ప్రభుత్వం ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియనట్టుగా కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో భారతీ జనతా పార్టీ వాళ్లు మరిన్ని సంచలన ప్రకటనలు చేస్తూ ఉన్నారు.

అందులో భాగంగా ఇరవై మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నట్టుగా కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప ప్రకటించడం విశేషం. ప్రస్తుతం కర్ణాటకలో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు అవి విడుదల అవుతాయి.

ఫలితాలు రాగానే కుమారస్వామి ప్రభుత్వం కూలిపోతుందని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా యడ్యూరప్ప ప్రకటించారు.

ఈ మాటల దాడిని ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇస్తోంది. తమకు కూడా పది మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్టుగా కాంగ్రెస్ వాళ్లు ప్రకటించుకుంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో చాలా లుకలుకలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ మాటల్లో పస లేదని పరిశీలకులు అంటున్నారు.

లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలే కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వ మనుగడను నిర్దేశించబోతున్నాయని.. కేంద్రంలో ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చినా, మూడు సీట్ల ఉప ఎన్నికల్లో కమలం పార్టీ రాణించినా.. కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడం ఖాయమని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News